Just SportsLatest News

Rajasthan Royals : సన్ రైజర్స్ ఔట్..క్వాలిఫైయర్ 2కు రాజస్థాన్

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది

Rajasthan Royals

ఐపీఎల్ 19వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ఎలిమినేటర్ లో ముగిసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) క్వాలిఫైయర్ 2కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో తొలుత బ్యాటింగ్ రావడమే మంచిదనుకున్న రాజస్థాన్(Rajasthan Royals) భారీ స్కోరే లక్ష్యంగా ఆడింది.

ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వైభవ్ సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కమిన్స్ తో సహా ప్రతీ బౌలర్ నూ ఉతికారేశాడు. కొడితే ఫోర్ లేకుంటే సిక్సర్ అన్న తరహాలో బుడ్డోడి విధ్వంసం సాగింది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీనిలో 8 సిక్సర్లు , ఒక ఫోర్ ఉన్నాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను అయితే ఉతికారేశాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లోనే వరుసగా మూడు సిక్సర్లు బాదేసాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ 80 పరుగులు చేసింది. వైభవ్, జైస్వాల్ తొలి వికెట్ కు కేవలం 8 ఓవర్లలోనే 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయగా… దీనిలో 12 సిక్సర్లున్నాయి. ఈ సీజన్ లో ఏకంగా 65 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ (59) రికార్డును బ్రేక్ చేశాడు.

కాసేపటికే జైస్వాల్ (29) ఔటైనా ధృవ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్ తో కలిసి 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే 50 ( 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ వేగంగా వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో పరాగ్ 26 (2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫెరీరా (12) , శనక (5), ఆర్చర్ (4) పరుగులకే ఔటయ్యారు. దీంతో 270 పైగా స్కోరు చేస్తుందనుకున్న రాజస్థాన్ 243 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీసాడు.

బ్యాటింగ్ పిచ్ కావడంతో 244 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈ స్కోరును ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే తొలి ఓవర్లోనే ఆర్చర్ దెబ్బకొట్టాడు. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. తర్వాత హెడ్ (17), ఇషాన్ కిషన్ (33) ధాటిగా ఆడి రెండో వికెట్ కు 51 పరుగులు జోడించారు.

Rajasthan Royals
Rajasthan Royals

ఇక్కడ మరోసారి ఆర్చర్ వరుస వికెట్లు తీసాడు. ఫలితంగా పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. స్మరన్ రవిచంద్రన్ ఔటైన కాసేపటికే క్లాసెన్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైపోయింది. నితీశ్ రెడ్డి(38), సలీల్ అరోరా(35) 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా కీలక సమయంలో ఔటయ్యారు.

ఇక్కడ నుంచి టెయిలెంటర్లు బ్యాటింగ్ కొనసాగించినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3 , జడేజా 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓటమితో సన్ రైజర్స్ ఇంటిదారి పడితే రాజస్థాన్(Rajasthan Royals) క్వాలిఫైయర్ 2లో గుజరాత్ తో తలపడనుంది.

Esha Singh : చరిత్ర సృష్టించిన ఈషా సింగ్..వరల్డ్ కప్ లో సరికొత్త ప్రపంచ రికార్డ్

Related Articles

Back to top button