Rishabh Pant : లక్నో కెప్టెన్సీకి పంత్ గుడ్ బై..ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడి
Rishabh Pant : రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో ప్రస్తుత సీజన్ లోనూ ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. కేవలం నాలుగే విజయాలు సాధించి సీజన్ ను అట్టడుగు స్థానంతో ముగించింది
Rishabh Pant
ఐపీఎల్ సీజన్ ముగిసిపోతున్న వేళ పలు ఫ్రాంచైజీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్(Rishabh Pant) తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పంత్ కోరాడనీ, అతని నిర్ణయాన్ని మర్యాదపూర్వకంగా అంగీకరించినట్టు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని పేర్కొంది. సారథిగా పంత్ ఫ్రాంచైజీకి గొప్ప సేవలందించాడని రాసుకొచ్చింది. నిజానికి ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ లోనే లక్నో ఇంటిదారి పట్టినప్పుడు కెప్టెన్సీ మార్పుపై వార్తలు వచ్చాయి. మీడియా సమావేశంలో ఆ ఫ్రాంచైజీ ‘గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ టామ్ మూడీ కూడా హింట్ ఇచ్చాడు. కొన్ని అంశాలపై సమీక్ష జరగాల్సి ఉందంటూ పేర్కొన్నాడు.
2025లో కెఎల్ రాహుల్ లక్నోను వీడిన తర్వాత వేలంలో పంత్ ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. అయితే నాయకుడిగానూ, వ్యక్తిగతంగానూ పంత్(Rishabh Pant) నిరాశ పరిచాడు. 2025 సీజన్ లో లక్నో కేవలం ఆరు విజయాలే సాధించింది. అయినా సరే 2026 సీజన్ లోనూ ఫ్రాంచైజీ యాజమాన్యం అతనిపైనే నమ్మకముంచింది. అయితే ఈసారి కూడా పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. సారథిగానూ, ఇటు బ్యాటర్ గానూ పూర్తిగా నిరాశపరిచాడు.
పంత్(Rishabh Pant) కెప్టెన్సీలో లక్నో ప్రస్తుత సీజన్ లోనూ ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. కేవలం నాలుగే విజయాలు సాధించి సీజన్ ను అట్టడుగు స్థానంతో ముగించింది. గత సీజన్ లో పంత్ 269 పరుగులు చేయగా.. ఈసారి 314 పరుగులు చేశాడు. తుది జట్టు ఎంపికలో, బ్యాటింగ్ ఆర్డర్ కు సంబంధించిన తప్పిదాలు లక్నో ప్రదర్శనను మరింత దిగజార్చాయి.

ముఖ్యంగా మార్కరమ్ లాంటి ప్లేయర్ ను పదే పదే వేర్వేరు స్థానాల్లో ఆడిస్తూ, బ్యాటింగ్ లైనప్ ను కూడా చెడగొట్టుకున్నారంటూ ఫ్రాంచైజీపైనా విమర్శలు వచ్చాయి. చివరికి జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పంత్ తనంతట తానుగానే తప్పుకున్నాడు. అటు ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా అతని కెప్టెన్సీ మార్పు దిశగానే ఆలోచించినట్టు కూడా వార్తలు వచ్చాయి.
దీంతో వేటు పడకముందే తప్పుకున్న పంత్ ఇకపై ఆటగాడిగానే కొనసాగనున్నాడు. మార్ష్ , పూరన్ , మార్కరమ్ వంటి సీనియర్లలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తారో చూడాలి.





