Afghanistan : అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడి..11 మంది చిన్నారులు బలి
Afghanistan : పాక్ వైమానిక దళాలు అర్థరాత్రి విచక్షణారహితంగా దాడులకు పాల్పడడంతో ఆఫ్ఘనిస్తాన్ లో అలజడి నెలకొంది
Afghanistan
ఒకవైపు అమెరికా,ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంటే మరోవైపు పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ ల(Afghanistan) మధ్య యుద్ధవాతావరణం తీవ్రరూపం దాల్చింది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్న వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అయితే దాడులు చేసే విషయంలో ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) కాస్త ఆలోచిస్తున్నా పాక్ మాత్రం నక్కజిత్తుల మారిలా తన బుద్ధిని చాటుకుంటోంది.
తాజాగా పాక్ వైమానిక దళాలు అర్థరాత్రి విచక్షణారహితంగా దాడులకు పాల్పడడంతో ఆఫ్ఘనిస్తాన్ లో అలజడి నెలకొంది. ఈ దాడుల్లో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 19 మంది చనిపోగా వీరిలో 11 మంది వరకూ చిన్నారులు ఉండడం కలచివేసింది.
ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లోని పక్తికా, కునార్, ఖోస్ట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులకు తెగబడింది. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే అమాయక పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుందని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆరోపించారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ దాడుల్లో వందల సంఖ్యలో ఆఫ్ఘన్ ప్రజలు గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. సమీపంలోని హాస్పిటల్స్ క్షతగాత్రులతో నిండిపోయాయి. వారందరికీ చికిత్స అందిస్తున్నామనీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించారు. కొంతకాలంగా ఆఫ్ఘన్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు పాక్,ఆఫ్ఘన్ పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇరాన్,అమెరికాల మధ్య తామే శాంతి చర్చలు జరిపి సంధి కుదురుస్తామంటూ కబుర్లు చెబుతున్న పాక్, ఆఫ్ఘన్ ప్రజలపై దాడులు చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు.

ఒకరికి బుద్ది చెబుతున్నట్టు హడావుడి చేస్తూ మరోవైపు పక్క దేశంలో రక్తపాతానికి పాల్పడడంతో పాక్ కపటబుద్ధి మరోసారి రుజువైందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్న పాక్ కు బుద్ది చెప్పాలని తాలిబన్లు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఏ క్షణమైనా పాక్ పై విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తోంది. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పాక్, ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
US – Iran War : మళ్లీ యుద్ధం మొదలు .. ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు





