Vijay Devarakonda : టీజీ20 లీగ్ పై టీసీఏ ఫైర్..విజయదేవరకొండకు నోటీసులు
Vijay Devarakonda : టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే వెంకటేశ్ నాయుడు, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకు కూడా నోటీసులు పంపినట్లు టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి తెలిపారు.
Vijay Devarakonda
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ పై వివాదం రాజుకుంది. ఈ టోర్నమెంట్ కు బీసీసీఐ అనుమతి లేదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపిస్తోంది. ఈ క్రమంలో టీజీ20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హీరో విజయదేవరకొండ(Vijay Devarakonda)కు లీగల్ నోటీసులు పంపించింది.
అలాగే వెంకటేశ్ నాయుడు, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు పంపించినట్టు టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి చెప్పారు. టీజీ20 లీగ్ ను మోసపూరిత లీగ్ గా అభివర్ణించిన ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బీసీసీఐ నుంచి తప్పనిసరిగా పొందాల్సిన అనుమతులు లేకుండానే ఈ లీగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహించబడుతున్న ఈ లీగ్‌లో భాగమైన ప్రతి వ్యక్తి, సంస్థ, ప్రమోటర్ మరియు ఫ్రాంచైజీ యాజమాన్యం భవిష్యత్తులో చట్టపరమైన, క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా టీజీ20 లీగ్ చట్టబద్ధత, హెచ్‌సీఏ వాణిజ్య కార్యకలాపాలు, రాజకీయ నాయకుల కుటుంబాల ప్రమేయం, సినీ ప్రముఖులు మరియు క్రికెటర్ల భాగస్వామ్యంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. టీజీ20 లీగ్ ప్రచారంలో భాగస్వాములైన సినీ నటుడు విజయ్ దేవరకొండ, వ్యాపారవేత్త వెంకటేశ్ నాయుడు, మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు, భారత జట్టు ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ధరం గురువారెడ్డి వెల్లడించారు.
బీసీసీఐ అనుమతులు లేని లీగ్‌ను ప్రమోట్ చేయడానికి ముందు వారు అనుమతి పత్రాలు పరిశీలించారా అని ప్రశ్నించారు. అనుమతులు లేని లీగ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ యువ క్రికెటర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర క్రికెట్ సంఘమైనా కమర్షియల్ టీ20 లీగ్ నిర్వహించాలంటే ముందస్తుగా బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుందని గురువారెడ్డి పేర్కొన్నారు. భారత క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ లీగ్‌లో ఎలా పాల్గొంటున్నారో స్పష్టం చేయాలని కోరిన ఆయన, బీసీసీఐ అనుమతులు ఉంటే వెంటనే వాటిని ప్రజల ముందుంచాలని హెచ్‌సీఏకు సవాల్ విసిరారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధి హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమని, మొత్తం తెలంగాణ క్రికెట్‌కు ప్రతినిధిగా వ్యవహరించే అధికారం హెచ్‌సీఏకు లేదని ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ జిల్లాల క్రికెట్ అభివృద్ధి కోసం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పని చేస్తోందని గుర్తు చేశారు. కాగా టీసీఏ లీగల్ నోటీసులపై హీరో విజయదేవరకొండ(Vijay Devarakonda), ఇతర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Ranabaali : రణబాలి మూవీ క్రేజీ అప్డేట్.. విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డ్..





