Just Andhra PradeshJust PoliticalLatest News

Mudragada Padmanabham : కాపు ఉద్యమనేత ముద్రగడ కన్నుమూత..

Mudragada Padmanabham : ఏపీలో కాపు ఉద్యమానికి నాంది పలికిన ఘనత ఆయనదే. సుదీర్ఘ కాలం పాటు కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమించారు.

Mudragada Padmanabham

ఏపీ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా అనారోగ్యం సమస్యలు పెరిగినట్టు తెలుస్తోంది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

1953 జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982లో టీడీపీలో చేరిన ముద్రగడ..
ఎన్టీఆర్ కేబినెట్‌లోనూ, తర్వాత కాంగ్రెస్‌లో చేరి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

ఏపీలో కాపు ఉద్యమానికి నాంది పలికిన ఘనత ఆయనదే. సుదీర్ఘ కాలం పాటు కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ 1994లో తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం కాపులకు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించే జీవో తెచ్చింది.

తుని కాపు ఐక్య గర్జన ముద్రగడ పోరాటాల్లో ఒకటి. చారిత్రాత్మక తుని సభ ద్వారా కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసారు. ఈ సభ తీవ్ర ఉద్రిక్తతలకు, రైలు దహనం వంటి హింసాత్మక ఘటనలకు దారితీసింది. సభ ముగిసిన తర్వాత కొందరు ఆందోళనకారులు తుని-హంసవరం రైల్వే స్టేషన్ల మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేసి, రాళ్లు రువ్వి రైలుకు నిప్పు పెట్టారు.

అంతేకాకుండా, తుని పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ అల్లర్లతో అప్పటి ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై పలు కేసులు నమోదు చేసింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ కేసులను ఎత్తివేశాయి. అయితే దశాబ్దాల పాటు కాపు సామాజికవర్గ హక్కుల కోసం పోరాటం సాగించిన ఘనత ముద్రగడకే దక్కుతుంది.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన కొన్ని విభేదాల వల్ల తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. పదవుల కంటే తన ఆశయాలకు, ఆత్మగౌరవానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు.

Mudragada Padmanabham
Mudragada Padmanabham

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మాట మీద నిలబడే వ్యక్తిగా ముద్రగడకు పేరుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు.

ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించగా, సాధారణ రాజకీయ నాయకుల్లా కాకుండా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ ద్వారా తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ(Mudragada Padmanabham) రెడ్డిగా మార్చుకున్నారు.

Satellite Phone : బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ ..అడవులు, కొండల్లోనూ పనిచేసే సూపర్ డివైస్ స్పెషాలిటీలు ఇవే..

Related Articles

Back to top button