Kohli vs Gambhir : కోహ్లీ వర్సెస్ గంభీర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది ?
Kohli vs Gambhir : ప్రాక్టీస్‌లో కోహ్లీ ఒకవైపు, గిల్‌తో కలిసి గంభీర్ మరోవైపు ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో కొహ్లీతో గంభీర్‌కు విభేదాలున్నాయన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
Kohli vs Gambhir
భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా బాగానే ఉందా? సీనియర్ ఆటగాళ్లతో గంభీర్‌కు ఉన్న విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయా ? ముఖ్యంగా కోహ్లీ, గంభీర్(Kohli vs Gambhir) మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా.. అంటే అవుననే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో కొన్ని ఊహించని సీన్స్ కనిపించాయి. ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్(Kohli vs Gambhir) మాట్లాడుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోలేదన్న ప్రచారం కూడా గట్టిగానే నడుస్తోంది.
ప్రాక్టీస్‌లో కోహ్లీ ఒకవైపు, గిల్‌తో కలిసి గంభీర్ మరోవైపు ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో కొహ్లీతో గంభీర్‌కు విభేదాలున్నాయన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నెట్స్ ప్రాక్టీస్ సమయంలో గంభీర్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఇతర ఆటగాళ్లతో మాట్లాడినా కోహ్లీ వైపు వెళ్లలేదు. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కొన్నిసార్లు క్లీన్ బౌల్డ్ అవడంతో గంభీర్ స్వయంగా వెళ్లి సూచనలు ఇవ్వకుండా, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ద్వారా కోహ్లీకి సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రాక్టీస్ జరుగుతున్నంత సేపు వీరిద్దరి మధ్య కనీసం ఐ-కాంటాక్ట్ కూడా లేకపోవడంతో కోల్డ్ వార్ నడుస్తోందని మీడియా వర్గాలు కథనాలు రాసేసాయి. రాబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో భారీ మార్పులు చేయాలని, యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నాడు. సీనియర్లపై ఎక్కువగా ఆధారపడకుండా యువ జట్టునే సిద్ధం చేయాలని అతని వ్యూహం. అయితే దీనిపై కోహ్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

వరల్డ్ కప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లీ తన ప్లేస్‌పై ఇప్పటికే కొన్నిసార్లు బీసీసీఐ సెలక్టర్లతో మాట్లాడినట్టు తెలుస్తోంది. నిజానికి కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గంభీర్ వ్యవహార శైలే కారణమన్న రూమార్స్ ఉన్నాయి.
సీనియర్లను జట్టు నుంచి పంపించడమే లక్ష్యంగా మొదటి నుంచీ గంభీర్ శైలి ఉందని చాలామంది అభిప్రాయం. దీంతో కోహ్లీ ఈ పరిణామాలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణాన్ని బీసీసీఐ వెంటనే చక్కదిద్దాలంటూ బోర్డుకు కొంతమంది సూచిస్తున్నారు.





