HealthLatest News

Potato Juice : పొటాటో జ్యూస్‌తో నిజంగా లాభాలుంటాయా? ఈ చిన్న తప్పు చేస్తే ప్రమాదమా?

Potato Juice : చాలామంది ఆలూ రసాన్ని ముఖానికి రాసుకోవడం లేదా తాగడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు పోయి చర్మం తెల్లగా మారుతుందని అంటారు.

Potato Juice

మనం సాధారణంగా బంగాళాదుంపలను వేపుళ్లు, కూరలు, రకరకాల స్నాక్స్ రూపంలోనే తింటూ ఉంటాం. కానీ పొటాటో రసాన్ని(Potato Juice) కొంతమంది ఒక హెల్త్ డ్రింక్‌లా కూడా తాగుతుంటారు. దీనిలో విటమిన్ సి, పొటాషియం, బి-విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఐతే బంగాళాదుంప రసంతో వచ్చే ప్రయోజనాలపై సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు ఉన్నా, శాస్త్రీయ ఆధారాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి.

పచ్చి పొటాటోలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, కొల్లాజెన్ తయారీకి, కణాల ప్రొటెక్షన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగాళాదుంపను ఉడికించినప్పుడు, వేయించినప్పుడు అందులోని విటమిన్ సి శాతం తగ్గుతుంది కాబట్టి, పచ్చి పొటాటో రసంలో ఇది ఎక్కువగా లభిస్తుంది.

అలాగే ఆలుగడ్డలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి కీలకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని అడ్డుకోవడంలో సహాయపడతాయి. దీంతో పాటు పొటాషియం, విటమిన్ B6 వంటి నరాల పని తీరుకు, కండరాల ఆరోగ్యానికి, బాడీ శక్తికి ఉపయోగపడే పోషకాలు కూడా ఉంటాయి.

చాలామంది ఆలూ రసాన్ని ముఖానికి రాసుకోవడం లేదా తాగడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు పోయి చర్మం తెల్లగా మారుతుందని అంటారు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి మంచివే అయినా.. కేవలం ఈ పొటాటో జ్యూస్‌తోనే చర్మ సమస్యలన్నీ నయమైపోతాయని చెప్పడానికి బలమైన క్లినికల్ ఆధారాలు ఏవీ లేవు.

ఇక ఈ పొటాటో రసాన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. తాజా ఆలుగడ్డలను తీసుకుని శుభ్రంగా కడిగి, ఆకుపచ్చగా మారిన భాగాలు , మొలకలు ఉంటే వాటిని పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. దానిని వడకట్టి రసాన్ని తీసుకోవచ్చు. పచ్చి బంగాళాదుంప రసం తాగడం కష్టంగా ఉంటే దానిలో క్యారెట్ లేదా ఆపిల్ ముక్కలు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు.

Potato Juice
Potato Juice

ఐతే పొటాటో రసం(Potato Juice) తయారు చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఆకుపచ్చగా మారినవి, మొలకలు వచ్చిన బంగాళాదుంపలను అస్సలు వాడకూడదు. వాటిలో సోలనైన్ అనే విషపూరిత పదార్థం ఉంటుంది. దీనివల్ల వాంతులు, కడుపునొప్పి, విరేచనాలయ్యే ప్రమాదం ఉంది. పచ్చి రసం కొందరిలో కడుపు ఉబ్బరం , జీర్ణ సమస్యలు వంటివి కలిగించొచ్చు.

పొటాటో రసాన్ని ఒక సాధారణ పోషకాహారంగా మాత్రమే చూడాలి తప్ప.. రోగాలను తగ్గించే అద్భుత ఔషధంగా భావించకూడదు. ఏవైనా ఆరోగ్య సమస్యలున్నవారు, మెడిసిన్ వాడుతున్నవారు దీన్ని తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Samsung Galaxy Z Flip 8 : ట్రెండీ లుక్‌తో అదుర్స్..మార్కెట్‌లో క్రేజీగా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు

Related Articles

Back to top button