TTD : శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నవంబర్ కోటా ఆన్లైన్ రిలీజ్ డేట్స్, లక్కీ డిప్ వివరాలు ఇవే..
TTD : నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత దర్శనం టోకెన్లు , తిరుమల, తిరుపతి అద్దె గదుల బుకింగ్ కోటాను ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి టీటీడీ షెడ్యూల్ను విడుదల చేసింది.
TTD
నవంబర్ నెలలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకునే కోట్లాది మంది భక్తుల కోసం.. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత దర్శనం టోకెన్లు , తిరుమల, తిరుపతి అద్దె గదుల బుకింగ్ కోటాను వరుస తేదీల్లో ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి పక్కా షెడ్యూల్ను విడుదల చేసింది.
శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన లాంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోటాను ఆగస్ట్ 18వ తేదీ మార్నింగ్ 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులోకి తీసుకుని వస్తారు.
ఈ సేవలను ఆశించే భక్తులు ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో తమ పేర్లను ఫ్రీగానే నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్లో ఎంపికైన భక్తుల జాబితాను రిలీజ్ చేశాక, 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బులు చెల్లించి తమ లక్కీ డిప్ టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలతో పాటు సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు ,వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను బుకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంచుతారు.
24వ తేదీన కూడా విభిన్న కోటాలను రిలీజ్ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఫ్రీగా కేటాయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్లైన్లో ఉంచుతారు.
అంతేకాకుండా శ్రీవారి భక్తులు ఎక్కువ మంది ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆగస్ట్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల అలాగే తిరుపతిలోని టీటీడీ అద్దె గదుల కోటాను రిలీజ్ చేస్తారు.

మరోవైపు సైబర్ నేరగాళ్ల పట్ల టీటీడీ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శ్రీవారి దర్శనం, సేవలు, గదుల కేటాయింపు పేరుతో నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా పేజీలను క్రియేట్ చేసి.. భక్తుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నట్లు సైబర్ క్రైమ్ టీమ్స్ గుర్తించాయి.
టీటీడీ అధికారిక ముద్ర, లోగోలు వాడి భ్రమపరిచే డూప్లికేట్ లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని, వాట్సాప్ మెసేజులను నమ్మి ఖాతాలకు నగదు పంపొద్దని అధికారులు స్పష్టం చేశారు. కేవలం TTD అధికారిక వెబ్సైట్ అయిన (https://ttdevasthanams.ap.gov.in/) ద్వారా మాత్రమే భక్తులు తమ సేవా టికెట్లను అలాగే వసతి గదులను బుక్ చేసుకోవాలని సూచించారు.





