Nepal – Tibet : మరో ముప్పు ముంగిట నేపాల్-టిబెట్ సరిహద్దు.. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
Nepal - Tibet : కొండపైన ఇంకా నిలిచి ఉన్న నీటి సరస్సులు బద్దలైతే కనుక మరో వరద వస్తుందనే భయంతో రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పనిచేస్తున్నాయి.
Nepal – Tibet
హిమాలయాల కొండల్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం నుంచి అక్కడి వారెవ్వరూ ఇంకా కోలుకోలేదు. నేపాల్-టిబెట్(Nepal – Tibet) సరిహద్దుల్లో ఒక భారీ మంచు పర్వతం, కొండచరియలు రెండూ కూడా ఒక్కసారే విరిగిపడటంతో చెలరేగిన జలప్రళయం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొండల్లోంచి ఒక్కసారిగా వచ్చిన మంచు, రాళ్లు, బురద నీటి ధాటికి గ్రామాలు, రోడ్లు, వంతెనలు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లు నిమిషాల్లో కొట్టుకుపోయాయి.
ఆగస్ట్ 29 నాటికి అందిన సమాచారం ప్రకారం చూస్తే.. ఒక్క నేపాల్‌లోనే 579 మంది ప్రాణాలు కోల్పోయారు. టిబెట్‌లో కూడా మరణాలు నమోదయ్యాయి. నేపాల్, టిబెట్ పరిధిలో సుమారు 2,400 మందికి పైగా గల్లంతయ్యారు. రెడ్ క్రాస్ అంచనా ప్రకారం 93 వేల మందికి పైగా దీని వల్ల తీవ్రంగా ప్రభావం చెందారు. అయితే పైనుంచి మరో జలప్రళయం వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు రావడం వల్ల సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారుతోంది.
ఈ విపత్తు ఆగస్ట్ 26 బుధవారం రోజు నేపాల్-చైనా సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ ప్రాంతంలో మొదలైంది. ఒక భారీ మంచు కొండ ఒక్కసారిగా విరిగి కింద పడటంతో భూమి కంపించినట్లుగా దాదాపు 5.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మొదట్లో ఇది భూకంపం అనుకున్నా కూడ, శాస్త్రవేత్తల విశ్లేషణలో కొండచరియలు పడటం వల్లే ఆ ప్రకంపనలు వచ్చాయని తేలింది.
ఈ మంచు, బురద లెండే నదిలోకి ప్రవాహంగా వచ్చి పడటంతో టెంపరరీగా ఒక నేచురల్ డ్యామ్ ఏర్పడింది. అలా నీటి ఒత్తిడి ఎక్కువై ఆ డ్యామ్ ఒక్కసారిగా బద్దలవడంతో కింద ఉన్న ఊళ్లపైకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం మృత్యువై విరుచుకుపడింది. రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమై పోయాయి. నేపాల్‌లోని రసువా, నువాకోట్ జిల్లాలతో పాటు చైనాలోని గైరోంగ్ ప్రాంతం దీని వల్ల బాగా నష్టపోయాయి.
హిమాలయాలు మామూలు రోజుల్లోనే కష్టంగా ఉండే ప్రాంతాలు కావడం, మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా ధ్వంసం అవడం వల్ల ఎవరైనా బతికి ఉన్నారా అని వెతకడం రెస్క్యూ టీమ్‌లకు నరకంగా మారుతోంది.కొండపైన ఇంకా నిలిచి ఉన్న నీటి సరస్సులు బద్దలైతే కనుక మరో వరద వస్తుందనే భయంతో రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పనిచేస్తున్నాయి.
నేపాల్‌లో 1,924 మంది, టిబెట్ పరిధిలో వందలాది మంది ఆచూకి ఇంకా దొరకడం లేదు. వీరిలో విదేశీ టూరిస్టులతో పాటు కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు కూడా ఉన్నారు.
నేపాల్ సైన్యం, విపత్తు నిర్వహణ టీమ్స్ హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఆహారాన్ని, నీటిని అందిస్తున్నాయి. ఈ విపత్తు తర్వాత ఇప్పటివరకు 3,700 మందిని కాపాడారు. మరోవైపు చైనా వైపు రోడ్లు పూర్తిగా తెగిపోవడంతో రెస్క్యూ టీమ్‌లు అడవులు, కొండలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. బోర్డర్ చెక్‌పోస్టులు కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయాయి.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో చైనా చేపడుతున్న వరుస నిర్మాణాలు, అలాగే సొరంగాల తవ్వకాలు, బ్లాస్టింగ్‌ల వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, యుఎస్‌జీఎస్, ఐసీఐఎంఓడీ మాత్రం ఇది సహజంగా మంచు కొండ కరిగి కూలిపోవడం వల్ల జరిగిందేనని తేల్చి చెప్పాయి.

కాకపోతే చైనా చేసిన డిజిగ్నేటెడ్ కన్‌స్ట్రక్షన్ల వల్ల ఇక్కడ ఊళ్లు, వంతెనలు బాగా పెరిగి విపత్తు తీవ్రతతో పాటు ప్రాణనష్టం కూడా ఊహించని రేంజ్‌లో పెరిగిందనేది మాత్రం నిజం. క్లైమేట్ చేంజ్ వల్ల గ్లేసియర్లు కరగడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా ఈ ప్రమాదంలో భారత పౌరులు కూడా భారీగానే చిక్కుకున్నారు. భారత విదేశాంగ శాఖ చెప్పిన సమాచారం ప్రకారం 320 మంది భారతీయులు నేపాల్‌లో గల్లంతయ్యారు. మరో 400 మందికి పైగా చైనా వైపు క్షేమంగానే ఉన్నారని, ఇప్పటికే 149 మంది సురక్షితంగా నేపాల్ మార్గం గుండా ఇండియాకు చేరుకున్నారని అధికారులు తెలిపారు.





