Ganesh Chaturthi : వినాయకుడి తొండం ఎటు వైపు ఉండాలి? ఈ ఏడాది ఉదయం 7:30 లోపు పూజ ఎందుకు చేయకూడదు?
Ganesh Chaturthi : చాలామంది గణేషుడి విగ్రహానికి తొండం ఎటు వైపు ఉండాలనే విషయంలో ఎప్పుడూ అయోమయంలోనే ఉంటారు.
Ganesh Chaturthi
భాద్రపద శుద్ధ చతుర్థి వస్తుంది అంటే చాలు ప్రతీ ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది. మనం ఏ పనిని ప్రారంభించినా కూడా ఆ పనిలో విఘ్నాలు కలగకుండా చూసే విఘ్నాధిపతిని భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటాం. అయితే వినాయక చవితికి ఇంట్లోకి ఎలాంటి విగ్రహాన్ని తీసుకురావాలి? గణేషుడి తొండం ఎటువైపు ఉండాలి? ఈ ఏడాది పూజా ముహూర్తం ఏంటనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
గణేషుని పూజ కోసం విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని సహజసిద్ధమైన మట్టి విగ్రహాలనే ఎంచుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో చేసిన విగ్రహాలను అస్సలు వాడొద్దు.
చాలామంది గణేషుడి విగ్రహానికి తొండం ఎటు సైడ్ ఉండాలనే విషయంలో ఎప్పుడూ అయోమయంలోనే ఉంటారు. అయితే సాధారణంగా ఇంట్లో పూజించడానికి ఎప్పుడూ కూడా ఎడమ వైపు తిరిగిన తొండం (వామవర్తి వినాయకుడు) ఉన్న విగ్రహం మాత్రమే తెచ్చుకోవాలి. ఎడమ వైపు తొండం ఉండే లంభోదరుడు.. చంద్ర నాడికి ప్రతీకగా చెబుతారు. ఈ వినాయకుడు శాంత మూర్తి, త్వరగా ప్రసన్నుడవుతాడు. సాధారణ పూజా నియమాలతోనే ఈ గణపయ్యను పూజించొచ్చు.
అదే కుడి వైపు తిరిగిన తొండం (దక్షిణవర్తి వినాయకుడు) ఉన్న వినాయకుడి విగ్రహం సూర్య నాడికి ప్రతీకగా చెబుతారు. ఈ రూపంలో ఉన్న స్వామికి అత్యంత కఠినమైన పూజా నియమాలు ఉండాలి.ప్రతీరోజూ మంత్రోచ్ఛారణలు అవసరం. ఆ నియమాల్లో చిన్న పొరపాటు జరిగినా ప్రతికూల ఫలితాలుంటాయని భావిస్తారు.
అందుకే ఆలయాల్లో , మండపాలలో అలాగే ప్రత్యేక నిష్ట ఉన్న చోట మాత్రమే కుడి వైపు తొండం ఉన్న గణనాథుడిని ప్రతిష్టించి పూజిస్తారు. కాబట్టి ఇంట్లోకి మాత్రం ఎప్పుడూ ఎడమ వైపు తొండం ఉన్న ప్రసన్న వదనంతో, కూర్చుని ఉన్న భంగిమలో ఉండే విగ్రహాన్ని తేవడమే అత్యంత శుభకరం.
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14 సోమవారం జరుపుకొంటున్నాం. ఈసారి చతుర్థి తిథి ఉదయం 7:06 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 7:30 లోపు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, పూజ చేయడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. 7:30 తర్వాత నుంచి మధ్యాహ్నం 1:35 లోపు మీ వీలును బట్టి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి పూజ పూర్తి చేసుకోవచ్చు.

ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. పీటపై డైరెక్టుగా గణేషుని ప్రతిమ పెట్టకూడదు. పీటపై ఎర్రటి లేదా పసుపు కలర్ క్లాత్‌ను పరిచి, దానిపై బియ్యాన్ని పోసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
ముందు పసుపు గణపతిని తయారుచేసి విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేయాలి. ఆ తర్వాత గణపతి విగ్రహానికి ఆవాహన, ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ చేయాలి. గణేషుడికి అత్యంత ఇష్టమైన 21 రకాల పత్రులతో అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజించాలి.





