Pensioners : ఏపీలో ఆ పెన్షనర్లలో ఆందోళన.. అసలేం జరిగింది?
Pensioners:ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందిస్తున్నారు.

Pensioners
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం లబ్ధిదారులకు కొత్త టెన్షన్ మొదలైంది. అనర్హులను ఏరివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తుండటంతో, లబ్ధిదారుల పునఃపరిశీలన ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ క్రమంలో, మొదటి నోటీసులకు స్పందించని వారికి ఇప్పుడు రెండోసారి నోటీసులు పంపుతోంది. అసలు ఈ తనిఖీలు ఎందుకు, ఎవరికి పింఛన్లు ఆగిపోయాయి?
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 65.31 లక్షల మంది పింఛనుదారులు (Pensioners)ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వీరందరికీ పింఛన్లు అందుతున్నాయి. ఈ పథకం కింద 7,87,976 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. దీనితో పాటు, తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 30,924 మందికి కూడా పింఛన్లు అందుతున్నాయి.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు (Pensioners) అందిస్తున్నారు. అయితే, దివ్యాంగుల పింఛన్ల జారీలో గతంలో అక్రమాలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. వైకల్యం తక్కువగా ఉన్నవారు కూడా ఎక్కువ శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు చూపించి పింఛన్లు పొందుతున్నారని గుర్తించడంతో, అలాంటి అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టింది.
ఈ విచారణలో భాగంగా, 2025 ఫిబ్రవరి నెల నుంచి సదరం శిబిరాల ద్వారా దివ్యాంగులకు వైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో వైకల్యం శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారిని గుర్తించారు. ఈ పరీక్షలకు హాజరు కావాలని మొదటిసారి నోటీసులు పంపించినా, కొంతమంది లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆగస్టు నెలలో వారికి పింఛన్ కూడా నిలిపివేయబడినట్లు సమాచారం. అయితే, కొందరు లబ్ధిదారులు సచివాలయాల సహాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ చేసి తమ పింఛన్ సొమ్మును పొందగలిగారు.

మరికొంతమంది లబ్ధిదారులకు రెండోసారి నోటీసులు పంపిస్తున్నారు. ఈ నోటీసుల్లో నిర్దిష్ట తేదీలు, కేటగిరీల వారీగా పరీక్షలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. సదరం కేంద్రాల్లో వైకల్య పరీక్షలు పూర్తి చేసుకుని, ఆ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా కొందరికి పింఛన్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల కొరత వంటి కారణాల వల్ల కొన్నిచోట్ల పునఃపరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే అనర్హులను ఏరివేసి, నిజమైన అర్హులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.