Just TelanganaLatest News

EL Nino : తెలంగాణపై ఎల్‌నినో పంజా..హైదరాబాద్‌కు మున్ముందు నీటి కటకట తప్పదా?

EL Nino : పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే పరిణామాన్నే శాస్త్రవేత్తలు ఎల్‌నినో అంటున్నారు.

EL Nino

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలను ఎల్‌నినో భయపెడుతోందని ఐక్యరాజ్యసమితి వార్నింగ్ ఇస్తుంటే.. భారత దేశంలో ఏకంగా 60 శాతం రాష్ట్రాల గొంతు ఎండిపోతుందని కేంద్రం తేల్చి చెప్పింది. ఇక తెలంగాణలో అయితే ఈ ఎల్‌నినో(EL Nino) ప్రభావం ఇప్పటికే కళ్లముందే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 11.18 లక్షల ఎకరాల్లో కరవు ఛాయలు కమ్ముకున్నాయి.

తగినంతగా వర్షాలు లేక చేతికొచ్చే దశలోనే పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మరోవైపు మరో 5 లక్షల ఎకరాల్లో పంటలకు తెగుళ్ల బెడద తప్పదంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పుడే చావుకబురు చల్లగా చెబుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం లేదనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో వాటర్ బోర్డ్ ఎండీ, హైదరాబాద్ కలెక్టర్లతో కూడిన టీమ్ క్షేత్రస్థాయి రిపోర్టులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించింది. అయితే ఆ నివేదిక సారాంశం చూస్తే ఎవరికైనా గుండె గుభిల్లుమనాల్సిందే.

కృష్ణా బేసిన్‌లో రావాల్సిన వాటర్‌లో ఏకంగా 70 పర్సెంటేజ్‌ లోటు కనిపిస్తోంది. గోదావరి రిజర్వాయర్లలో కూడా 34 శాతం నీటి కొరత ఉంది. ఇక సింగూరు డ్యామ్‌లో ఉండాల్సిన 29.91 టీఎంసీలకు బదులు కేవలం 4 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. ఆ నీళ్లతో కూడా డిసెంబర్ నెలను దాటడం కష్టమే. ఇప్పుడు భాగ్యనగరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే కనుక.. వాటర్ బోర్డ్ అందిస్తున్న 14.5 లక్షల నల్లా కనెక్షన్లలో మూడో వంతు అంటే దాదాపు 4 లక్షల నల్లాలలో చుక్కనీరు కూడా రాని ప్రమాదం పొంచి ఉంది.

దీంతో అసలు ఎల్‌నినో (El Niño) అంటే ఏంటి.. మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నామనే చర్చ మరోసారి సాగుతోంది. నిజానికి స్పానిష్ భాషలో ఎల్‌నినో అంటే చిన్నబ్బాయి అని అర్థం. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే పరిణామాన్నే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎల్‌నినో అంటున్నారు.

మహాసముద్రంలో వేడిగాలుల ఎఫెక్ట్‌తో తూర్పు పసిఫిక్ వాటర్ విపరీతంగా వేడెక్కి, గ్లోబల్ వాతావరణం సిస్టమ్‌ను పూర్తిగా తలకిందులు చేస్తుంది. మన దేశానికి, ముఖ్యంగా నైరుతి రుతుపవనాల ద్వారా రావాల్సిన వానలను ఈ ఎల్‌నినో అడ్డుకుంటుంది లేదంటే బాగా బలహీనపరుస్తుంది. దీనివల్ల రావాల్సిన వర్షాలు పడక, భూమి ఎండిపోయి భయంకరమైన కరవు పరిస్థితులు ఏర్పడతాయి.

ఈ ఎల్‌నినో ప్రభావం ఇంకా ఎంతకాలం ఉంటుందంటే..వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఎల్‌నినో(EL Nino) ప్రభావం సాధారణంగా 9 నెలల నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఏడాదిన్నర వరకు కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే, ఈ తీవ్రత రాబోయే కొన్ని నెలల పాటు ముఖ్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. సముద్ర ఉష్ణోగ్రతలు తిరిగి .. లా నినా వైపు అంటే సాధారణ స్థితికి మారేంత వరకు ఈ వాతావరణ అస్థిరత తప్పదని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. కరవు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు కూడా వేడెక్కుతుండటంతో రాబోయే రోజులు మరింత కీలకంగా మారనున్నాయి.

Slow Dating : డేటింగ్ యాప్‌ల కల్చర్‌కు చెక్.. ట్రెండ్‌లో స్లో డేటింగ్

Related Articles

Back to top button