Devara Gattu Bunny Ustavam : ప్రాణాలు పోతున్నా మారని విశ్వాసం..రక్తం చిందుతున్నా వెనక్కి తగ్గని మూర్ఖత్వం
Devara Gattu Bunny Ustavam : కర్నూలు జిల్లాలో దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో శతాబ్దాల నాటి భయంకర ఆచారం మళ్లీ రక్తాన్ని చిందించింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి 11 గ్రామాల ప్రజలు పదునైన కర్రలతో కొట్టుకోవడంతో..ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, వందమందికి పైగా గాయపడ్డారు.
Devara Gattu Bunny Ustavam
టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాలతో ప్రపంచం అంతా ఎక్కడికో దూసుకెళుతుంటే.. మన దగ్గర మాత్రం ఇంకా శతాబ్దాల నాటి ఆచారాల పేరుతో రక్తం ఏరులై పారుతోంది. దసరా పండగ వచ్చిందంటే భక్తి పారవశ్యం, విజయోత్సవ ఉత్సాహం కలగలిసి ఉండాలి. కానీ కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవంలో(Devara Gattu Bunny Ustavam) మాత్రం ప్రతి ఏడాది ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యే రాక్షస క్రీడ పునరావృతమవుతోంది.
ఈసారి కూడా ఎప్పటిలాగే చట్టాలు, పోలీసుల కఠిన ఆంక్షలు, కేసుల హెచ్చరికలు అన్నీ కూడా భక్తుల మూర్ఖత్వపు పట్టుదలల మధ్య మట్టిలో కలిసిపోయాయి. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఎవరికి వారు తమ గ్రామ సరిహద్దుల్లోకి దక్కించుకోవాలనే ఒకే ఒక్క కారణంతో.. 11 గ్రామాల భక్తులు పదునైన ఇనుప దిమ్మెలు తొడిగిన పెద్ద పెద్ద కర్రలతో వీధిపోరాటానికి తెగబడ్డారు. వేలాదిగా విరుచుకుపడిన జనసందోహం ధాటికి భద్రతా బలగాలు కూడా చేతులెత్తేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాత్రి సమయంలో అత్యంత ఉద్వేగపూరిత, ఆందోళనకర వాతావరణంలో జరిగిన ఈ భీకర కర్రల సమరంలో దేవరగట్టు(Devara Gattu Bunny Ustavam) కొండల్లో రక్తం చిమ్మింది. ఎవరి తలలు పగిలి రక్తం కారుతున్నా, ఒళ్లంతా గాయాలవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా భక్తులు మాత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాల రక్షణ కోసం ఒకరిపై ఒకరు భయంకరంగా విరుచుకుపడ్డారు.
ఈ హింసాత్మక ఘర్షణల దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఏకంగా 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి చాలా సీరియస్‌గా మారడంతో ఆలూరు, ఆదోని, కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రులకు తరలించి ఐసీయూల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
నెరిణి, నెరిణికి తండా, కొత్తపేట,అరికేర, అరికేర తండా, ఎల్లార్తి, విరుపాపురం, హొళగుంద, సులువాయి, ఆలూరు ప్రాంతాలకు చెందిన 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, తమ ఊరికి శుభం జరగాలనే గుడ్డి సెంటిమెంట్‌తో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ నెత్తుటి జైత్రయాత్రను ముగించారు.
ఈ రోజుల్లో కూడా జనాలు తమ ప్రాణాలు పోతున్నా కూడా ఇలాంటి మూర్ఖత్వంలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు? ఈ హింసను భక్తి అని ఎలా సమర్థించుకుంటున్నారనే విషయంపై మానసిక నిపుణులు షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. సైకాలజీ ప్రకారం దీనిని ‘మాస్ హిస్టీరియా’ (Mass Hysteria), ‘మాబ్ మైండ్ సెట్’ (Groupthink) అంటారు.
వేలాది మంది ఒకే ఆలోచనతో ఒకలాంటి ఉద్రేకంలో ఉన్నప్పుడు, వ్యక్తులుగా తమ సొంతంగా ఆలోచించే శక్తిని , విచక్షణను కోల్పోతారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని తామే ఆపితే తమ గ్రామానికి అరిష్టం జరుగుతుందనే తీవ్రమైన ‘ఫియర్ సైకాలజీ’ (Fear Psychology) వారి మైండ్‌ను ఆవహిస్తుంది.
దీంతో పాటు గుంపులో ఒకరిని చూసి మరొకరు ఆవేశపడే ఇలాంటి ప్రవర్తన ముందు చట్టాలు, రక్షణ బలగాలు, కనీస మానవత్వం లాంటివన్నీ ఓడిపోతాయని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా మూఢనమ్మకాల నుంచి సొసైటీని కాపాడాలంటే కేవలం పోలీసుల ఆంక్షలు ఒక్కటే సరిపోవని, ఈ మూర్ఖత్వపు భయాలను కడిగేలా వారిలో అవేర్నెస్ రానంత వరకు ఇలాంటి ఆచారాలకు చెక్ పడడం కష్టమే అంటున్నారు.





