Text Message Fights : గొడవలొస్తే వాట్సాప్‌లో పారాగ్రాఫ్‌లు రాస్తున్నారా? ఆ తప్పుతోనే బంధాలు తెగిపోతాయి జాగ్రత్త..
Text Message Fights : చిన్న గొడవ రాగానే వాట్సాప్‌లో చాంతాడంత మెసేజులు పంపుతున్నారా? టెక్స్ట్ మెసేజుల వల్ల రిలేషన్‌షిప్‌లు ఎలా దెబ్బతింటాయి? సైకాలజిస్టులు దీని గురించి ఏమంటున్నారు?
Text Message Fights
ఎవరితోనైనా గొడవ లేదంటే అభిప్రాయ భేదాలు రాగానే చాలామంది చేతులు టక్కున మొబైల్ దగ్గరకు వెళ్లిపోతాయి. ఎదురుగా కూర్చుని మాట్లాడే ధైర్యం లేకో, లేక వారి పాయింట్‌ను ప్రూవ్ చేసుకోవాలనే కంగారులోనో.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ తెరిచి పారాగ్రాఫ్‌లకు పారాగ్రాఫ్‌లు టైప్ చేసి సెండ్ చేస్తుంటారు.
అయితే అక్కడ గొడవ సాల్వ్ అవడం మాట పక్కనపెడితే అదే మరింత పెద్దదై ఆ రిలేషన్ కొంపముంచుతుంది. నేనలా అనలేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని మళ్లీ టైప్ చేసేలోపే జరగాల్సిన డ్యామేజ్ కాస్తా జరిగిపోతుంది. దీనికోసమే సైకాలజిస్టులు ఒక క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు. గొడవలైనప్పుడు ఛాటింగ్ బాక్స్‌లు పక్కన పెట్టి, కాల్ చేయడం లేదంటే డైరెక్టుగా కూర్చుని మాట్లాడుకోవడం చేయాలని సూచిస్తున్నారు.
మనం ఒక పర్సన్‌తో ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు కేవలం చాటింగ్ ఒకటి మాత్రమే కమ్యూనికేట్ చేయదు. మన బాడీ లాంగ్వేజ్, కళ్లలోని భావాలు, గొంతులోని టోన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్.. ఇవన్నీ కలిసి మన ఫీలింగ్స్ అవతలి వ్యక్తికి సరైన రీతిలో చేరవేస్తాయి.
సైకాలజిస్టులు చెబుతున్నదాని ప్రకారం మనం మాట్లాడే కమ్యూనికేషన్లో చాటింగ్ పాత్ర కేవలం 7 శాతమే. మిగతా 93 శాతం టోన్ ఆఫ్ వాయిస్, బాడీ లాంగ్వేజ్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఈ టెక్స్ట్ మెసేజ్‌లలో(Text Message Fights) ఈ 93 శాతం ఇంపార్టెంట్ ఎమోషన్ పూర్తిగా మిస్ అయిపోవడమే అసలు సమస్య.
ఒకరు చాలా నార్మల్‌గా లేదంటే బాధతోనో ఒక మెసేజ్ సెండ్ చేస్తే.. ఎదుటివారు ఆ టైమ్‌లో ఉన్న మూడ్‌ను బట్టి దాన్ని పొగరుగానో, సెటైరిక్గానో , కోపంగానో అర్థం చేసుకునే ప్రమాదం 100 పర్సంట్ ఉంది. ఉదాహరణకు సరే నీకు అంతా తెలుసు అని టైప్ చేస్తే, అది నిజమైన అంగీకారమో లేక వెటకారమో అవతలి పర్సన్‌కు అస్సలు అర్థం కాదు. అందుకే టెక్స్టింగ్ అనేది మైండ్ గేమ్‌గా మారి, లేని పోని అపోహలకు (Misunderstandings) దారి తీస్తుంది.
అంతేకాదు, ఒక్కోసారి మెసేజ్ పంపిన తర్వాత అవతలి వ్యక్తి దాన్ని చూసినట్లు రిప్లై ఇవ్వడానికి తీసుకునే సమయం కూడా మన మైండ్‌లో తీవ్రమైన యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. “ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? కావాలనే లైట్ తీసుకుంటున్నారా? నన్ను కేర్ చేయడంలేదా?” అనే ఓవర్ థింకింగ్ ఆలోచనలు మైండ్‌ను నింపేస్తాయి.
దీనివల్ల అసలు గొడవ పక్కకు పోయి, ఈ రిప్లై ఆలస్యం అనే కొత్త గొడవ మొదలవుతుంది. ఇక టైపింగ్ స్పీడ్‌లో ఒకరి మాటను ఒకరు సరిగ్గా అర్థం చేసుకోకుండా..కేవలం కౌంటర్లు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తారు . అంతేకాదు కోపంలో ఉన్నప్పుడు మెసేజులు పంపిస్తే ..ఆ చాట్ హిస్టరీ మొబైల్లో అలానే ఉండిపోతుంది. తర్వాత ఎప్పుడు అయినా ఆ చాట్ చూసినపుడు ఆ పాత గాయాలు మళ్లీ గుచ్చుకుంటూనే ఉంటాయి.
అదే ఫోన్ కాల్లో కానీ, డైరెక్ట్‌గా మీట్ అయినపుడు కానీ సీన్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎదురెదురుగా కూర్చున్నప్పుడు అవతలి వ్యక్తి గొంతులోని బాధ లేదా కళ్లలోని ఆవేదన ఎదుటి వ్యక్తికి క్లియర్‌గా అర్థం అవుతుంది. ఎదుటివారిలోని ఈగోను తగ్గించి ఎంపతీని పెంచుతుంది. ఆ క్షణంలో గొంతులో కనిపించే బాధ.. ఎంత పెద్ద గొడవనైనా క్షణాల్లో కరిగించేస్తుంది. అందుకే బంధాలు నిలవాలన్నా, గొడవలు క్లియర్ అవ్వాలన్నా కూడా స్క్రీన్ వెనుక దాక్కోవడం మానేసి, డైరెక్ట్‌గా మనసు విప్పి మాట్లాడటమే ఏకైక పరిష్కారమని సైకాలజిస్టులు చెబుతున్నారు.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?





