Miss Universe India: మిస్ యూనివర్స్ ఇండియా 2025.. కిరీటం సొంతం చేసుకున్న రాజస్థాన్ అమ్మాయి
Miss Universe India: ఈ పోటీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా, హరియాణాకు చెందిన అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

Miss Universe India
మన దేశ అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అత్యున్నత వేదికపై.. ఇప్పుడు కొత్త కీర్తి కిరీటాన్ని అందుకున్నారు మణిక విశ్వకర్మ. జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ (Miss Universe India) పోటీల్లో ఆమె విజేతగా నిలిచి, భారతదేశ కీర్తిని మరింత ఇనుమడింపజేశారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్న మణిక, ఇప్పుడు నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగబోయే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక(Miss Universe India) పోటీలో మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) తన సౌందర్యంతో పాటు, అపారమైన ఆత్మవిశ్వాసంతో, తెలివితేటలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. ఈ పోటీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా, హరియాణాకు చెందిన అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమె విజయ ప్రస్థానం కేవలం అందం మీద ఆధారపడి సాగలేదు. ఆమె ప్రతిభ, విద్య, సామాజిక సేవకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను ఇది చాటి చెబుతుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న మణిక, గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు.
మణిక కేవలం తన అందంతోనే కాదు, బహుముఖ ప్రజ్ఞతోనూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె ఒక అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్. జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందారు. డ్యాన్స్‌తో పాటు చిత్రలేఖనంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. సుశ్రావ్యమైన సంభాషణ, అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలు ఆమె వ్యక్తిత్వానికి మరింత నిండుదనం తెచ్చాయి.

అంతేకాదు, మణికకు సమాజ సేవ పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉంది. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడేవారికి సేవలు అందించేందుకు ఆమె ‘న్యూరోనోవా’ అనే ఒక స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు. ఈ పోటీలో ఆమె భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యాన్ని ఎంతో గర్వంగా ప్రతిబింబించారు.
తన విజయం పట్ల మణిక ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నా ప్రయాణం నా స్వస్థలం గంగానగర్ నుంచి మొదలైంది. మనపై మనం నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. మణిక విజయం దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిని మరిన్ని అద్భుతాలను సాధించేలా ప్రేరేపిస్తుంది. రాబోయే అంతర్జాతీయ పోటీల్లో మణిక మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.