Yellow Jowar:చిరుధాన్యాల రారాజు పచ్చజొన్నలు.. షుగర్, బీపీ తగ్గాలంటే వీటిని తినాల్సిందే..
Yellow Jowar: పచ్చజొన్న రొట్టెలు కానీ పచ్చజొన్నల అన్నం కానీ తింటే కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయదు.
Yellow Jowar
మన పూర్వీకులు తిన్న ఆహారమే వారిని వందేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంచిందన్న విషయాన్ని ఈమధ్య కాలంలో అంతా తెలుసుకుంటున్నారు. ఆ ఆహారంలో ప్రధానమైనవి చిరుధాన్యాలు (Millets), అందులోనూ పచ్చజొన్నలు (Yellow Jowar) అత్యంత శక్తివంతమైనవి.
ప్రస్తుత కాలంలో మనం బియ్యం , గోధుమలపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. కానీ వీటితో పోలిస్తే పచ్చజొన్నల్లో (Yellow Jowar) పోషక విలువలు చాలా ఎక్కువ. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడేవారికి పచ్చజొన్నలు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మనం వీటిని తిన్న తర్వాత రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
పచ్చజొన్నల్లో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరమని చెప్పొచ్చు.
ఎందుకంటే పచ్చజొన్న రొట్టెలు కానీ పచ్చజొన్నల అన్నం కానీ తింటే కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీనివల్ల మనం అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉంటాం. అంతేకాకుండా, వీటిలో ఐరన్, మెగ్నీషియం ,కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడే మహిళలకు పచ్చజొన్నలు చాలా మేలు చేస్తాయి.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పచ్చజొన్నలు గ్లూటెన్ ఫ్రీ (Gluten-free). గోధుమలు పడని వారు నిశ్చింతగా వీటిని తీసుకోవచ్చు. పచ్చజొన్నలతో కేవలం రొట్టెలే కాకుండా దోసెలు, ఇడ్లీలు, ఉప్మా , అంబలి వంటివి కూడా చేసుకోవచ్చు. వేసవి కాలంలో పచ్చజొన్న అంబలి తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది , తక్షణ ఎనర్జీ లభిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల హైబ్రిడ్ రకాలు ఉన్నా కూడా, నాటు పచ్చజొన్నలు దొరికితే మాత్రం వదలకండి. వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు పచ్చజొన్నల(Yellow Jowar) ను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే.. ఫ్యూచర్లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే మళ్లీ పాత కాలపు ఆహార అలవాట్లకు మళ్లడం అవసరం అని అంతా తెలుసుకోవాలి.
Garuda Purana:గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ? అది అమంగళమా? శుభప్రదమా?



