Just TelanganaLatest News

Suravaram Sudhakar Reddy: సురవరం సుధాకర్ రెడ్డి .. ప్రజా పోరాటాల సారథి

Suravaram Sudhakar Reddy: ఆదివారం ఉదయం మగ్ధూమ్ భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర జరిపి, గాంధీ బోధానాసుపత్రికి శరీరాన్ని వైద్య పరిశోధన కోసం అప్పగించనున్నారు.

Suravaram Sudhakar Reddy

తెలంగాణలో వామపక్ష ఆలోచనకు కదిలే హృదయం, కార్మికుల గొంతుకగా నిలిచిన సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy)ఇక లేరనే వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలని శోక సంద్రంలో ముంచెత్తింది. హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణంతో సీపీఐలోనే కాక, మొత్తం వామపక్ష శ్రేణుల్లో దుఃఖం అలుముకుంది.

1942 మార్చి 25న పాలమూరు జిల్లాలోని కోన్రావుపల్లి గ్రామంలో జన్మించిన సుధాకర్ రెడ్డి, చిన్న వయసులోనే విప్లవ భావాలతో మమేకమయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం వెంకట్రామిరెడ్డి ఆయన తండ్రి. ఇక ప్రసిద్ధ పత్రికా మహర్షి సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన పెదనాన్న. కుటుంబం నుంచే వచ్చిన ఈ విప్లవ వారసత్వం ఆయనను ప్రజా ఉద్యమాల దారిలో నడిపించింది.

1957లో కర్నూలులో విద్యార్థి జీవితం గడుపుతున్నప్పుడు మొదటిసారి ఆయన పేరు పెద్ద ఎత్తున వినిపించింది. పాఠశాలల్లో కనీస అవసరాల కోసం జరిగిన పోరాటంలో విద్యార్థులను సమీకరించి గొంతెత్తిన సుధాకర్, కర్నూలు అంతటా ప్రఖ్యాతి పొందారు. అదే ఆరంభం. అక్కడినుంచే ఆయన ప్రయాణం విద్యార్థి సంఘాలనుంచి జాతీయ రాజకీయాల దాకా సాగింది.

1960లో AISF కర్నూలు పట్టణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అక్కడినుంచి రాష్ట్రం, దేశం దాకా ఎదిగారు. 1966, 1969లో AISF జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. విద్యార్థి ఉద్యమాల గాలి ఎగిరి ఆయనను నేరుగా కమ్యూనిస్ట్ పార్టీ దిశగా మలిచింది.

1971లో CPI జాతీయ కమిటీలో చేరి, 1974–84 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. 1985లో కొల్లాపూర్ నుంచి పోటీ చేశారు, 1990లో మరోసారి పోరాటం చేశారు, కానీ రెండుసార్లూ ఓటమి పాలయ్యారు. కానీ ఆయన వెనుకడుగు వేయలేదు. 1994లో డోన్ నుంచి అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఎదురుగా పోటీ చేశారు. ఓటమి వచ్చినా ఆయన పోరాటస్ఫూర్తి చల్లారలేదు.

ఆ తర్వాత 1998లో నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. అదే ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఘట్టం. 2000లో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేకంగా జరిగిన గొప్ప ఉద్యమంలో సుధాకర్ ముందుండి పోరాడారు. ఆందోళనలో పోలీసులు గుర్రాలతో తొక్కించగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆయన పోరాట స్ఫూర్తిని ఇంకా పెంచేలా చేసింది. 2004లో మరోసారి నల్గొండ ప్రజలు ఆయనను పార్లమెంటుకి పంపారు.

Suravaram Sudhakar Reddy
Suravaram Sudhakar Reddy

2012లో పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో CPI ప్రధాన కార్యదర్శిగా ఎంపికై 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. తెలుగు రాష్ట్రాలనుంచి ఆ బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఆయన పదవీకాలంలో ఎన్నో రాష్ట్రాల వామపక్ష నాయకులు ఆయన స్ఫూర్తితో ఎదిగారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కూడా భారత తరపున ఆయన పాల్గొనడం ఆయన దూరదృష్టికి నిదర్శనం.

సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy)ఒక రాజకీయ నాయకుడిగానే కాక, చక్కటి వాగ్దాటి కలిగిన వక్త, లోతైన అధ్యయనం చేసిన ఆలోచకుడిగా పేరుపొందారు. ఆయన మాటలో జ్వాల ఉండేది, ఆయన వాదనలో తర్కం ఉండేది. ఆయనతో కలిసిన ప్రతి ఒక్కరూ ఆయన సరళత, మానవత్వాన్ని మరచిపోలేదు.

ఇప్పడు ఆయన లేరు. CPI 4వ రాష్ట్ర మహాసభ ముగిసిన కొద్ది గంటలకే ఆయన (Suravaram Sudhakar Reddy)మరణ వార్త రావడం పార్టీ శ్రేణులను కన్నీటి పాలజేసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఇతర జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకుని నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు, పలు జాతీయ, రాష్ట్ర నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

ఆదివారం ఉదయం మగ్ధూమ్ భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర జరిపి, గాంధీ బోధానాసుపత్రికి శరీరాన్ని వైద్య పరిశోధన కోసం అప్పగించనున్నారు. తన జీవితమంతా ప్రజల కోసం అంకితం చేసిన నేత, తన చివరి శ్వాసలో కూడా సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో దేహాన్ని వైద్యశాస్త్రానికి దానం చేయడం ఆయన మానవతా విలువలకు నిదర్శనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button