Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. 12గంటల పాటు ఆలయం మూసివేత
Tirumala: సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Tirumala
తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు ముఖ్యమైన ప్రకటన. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం నుంచే శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాతే భక్తులకు మళ్లీ దర్శనాలు కల్పిస్తారు.
గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న (ఎల్లుండి) అర్ధరాత్రి 9:50 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8న (సోమవారం) తెల్లవారుజామున 1:31 గంటల వరకు కొనసాగనుంది. ఈ లెక్కన, టీటీడీ సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటల నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచనుంది. తిరిగి సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తం 12 గంటల పాటు శ్రీవారి(Tirumala) దర్శనాలు నిలిపివేయనున్నారు.
గ్రహణ సమయంలో ప్రత్యేక సేవలు, మార్పులు
రద్దు అయిన సేవలు.. చంద్రగ్రహణం వల్ల సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఏకాంత సేవలు.. స్వామి వారికి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన వంటి సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
అన్నప్రసాద వితరణ నిలిపివేత.. సెప్టెంబర్ 7న సాయంత్రం 3 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసివేస్తారు. తిరిగి సెప్టెంబర్ 8న ఉదయం 8:30 గంటలకు పంపిణీని పునః ప్రారంభిస్తారు.
శ్రీవారి (Tirumala) ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గ్రహణ సమయంలో కొన్ని పురాతన పద్ధతులను పాటించాలని సూచించారు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదని, ఇంట్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలపై దర్భ ఉంచాలని ఆయన సూచించారు. అలాగే గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానాలు చేయాలని తెలిపారు. ఈ నియమాలు పాటించడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెబుతారు.
భక్తులు ఈ విషయాలను గమనించి, సహకరించాలని టీటీడీ కోరింది. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తిరిగి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
One Comment