Flight:ఇకపై ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్ పరేషాన్ లేదు..కొత్త రూల్స్ ఏంటి ? ఎప్పటి నుంచి అమలు?
Flight: ఇప్పటి వరకూ టికెట్ క్యాన్సిలేషన్ తర్వాత రీఫండ్ కోసం చాలా టైమ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది.
Flight
విమాన ప్రయాణం చేసే సామాన్యులకు డీజీసీఏ తాజాగా తీపి కబురు వినిపించింది. గతంలో టికెట్ బుక్ చేసిన తర్వాత ప్రయాణ షెడ్యూల్ మారితే విమాన సంస్థల కండీషన్ల వల్ల ఎంతో ఆర్థిక భారం పడేది. ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన సంస్థ డీజీసీఏ.. ప్రయాణికుల ప్రయోజనాల కోసం కొన్ని కీలకమైన మార్పులను తీసుకురాబోతోంది. అది కూడా ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు రానున్నాయి. ఇవి ఫ్లైట్ జర్నీ అనుభవాన్ని మరింత ఈజీ చేయనున్నాయి.
దీని ప్రకారం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి ఎక్సట్రా అమౌంట్ పే చేయకుండానే ప్రయాణికులు తమ జర్నీని క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా డేట్‌ను మార్చుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటపుడు పేర్లలో ఏవైనా చిన్న పొరపాట్లు దొర్లితే, బుక్ చేసిన 24 గంటల లోపు ఎటువంటి ఛార్జీలు లేకుండా వాటిని కరెక్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఇది ప్రయాణికులకు అనవసరమైన టెన్షన్‌ను తగ్గిస్తుంది. ఇక విమాన(Flight) జర్నీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయమైన రీఫండ్ల విషయంలోనూ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా తన టికెట్‌ను రద్దు చేసుకున్నా , అనుకోని కారణాల వల్ల ఫ్లైట్ ఎక్కలేకపోయినా, సంబంధిత విమాన సంస్థలు యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుతో పాటు, ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజు , ప్యాసింజర్ సర్వీస్ ఫీజులను కూడా తప్పనిసరిగా తిరిగి ఇచ్చేయాలి. టికెట్ నాన్-రీఫండబుల్ కేటగిరీకి చెందినదైనా సరే ఈ ట్యాక్సులను మొత్తాన్ని మాత్రం ప్రయాణికుడికి చెల్లించాల్సిందే.

నిజానికి ఇప్పటి వరకూ టికెట్ క్యాన్సిలేషన్ తర్వాత రీఫండ్ కోసం చాలా టైమ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇకపై విమాన(Flight) సంస్థలు 14 వర్కింగ్ డేస్‌లోనే రీఫండ్ ప్రక్రియను కంప్లీట్ చేయాలని కొత్త నిబంధన స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఏజెంట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా కూడా , రీఫండ్ బాధ్యత మాత్రం పూర్తిగా విమాన సంస్థలదే ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజెంట్లను కూడా విమాన సంస్థల రిప్రజెంటివ్స్‌గానే పరిగణించాలని డీజీసీఏ పేర్కొంది.
అయితే డైరెక్టుగా క్యాష్ రూపంలో టికెట్లను కొన్న వారికి ఆయా విమాన సంస్థల కార్యాలయాల ద్వారా వెంటనే రీఫండ్ పొందే అవకాశాన్ని కల్పించారు. మొత్తంగా చూస్తే, ఈ కొత్త కండీషన్ల వల్ల ప్రయాణికుల జేబుకు కత్తెర పడదు. అలాగే విమాన సంస్థల బాధ్యతాయుతమైన పనితీరు కూడా పెరుగుతుంది. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఈ మార్పులు, విమాన ప్రయాణాన్ని ఇంకా ఈజీగా మార్చనున్నాయి.





