Vande Bharat: తెలంగాణకు మరో 2 వందే భారత్ రైళ్లు..ఏఏ ప్రాంతాల మధ్య అంటే ?
Vande Bharat: సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ ధర ఎక్కువగానే ఉన్నా కూడా త్వరగా గమ్యస్థానం చేరుస్తుండడంతో ప్రయాణికులు వందే భారత్ రైళ్లనే ఆశ్రయిస్తున్నారు.

Vande Bharat
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ రైళ్ళకు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్రం పెంచుకుంటూ వెళుతోంది. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్స్ 2019లో ప్రవేశపెట్టగా.. ప్రస్తుతం 150 వరకూ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల మధ్య ఫోకస్ పెట్టి అదనంగా రైళ్ళను కేటాయిస్తోంది.
పండుగల సమయాల్లో అత్యంత రద్దీగా ఉండే కొన్ని ప్రత్యేక ప్రాంతాల మధ్య సర్వీసులు పెంచుతోంది. దీనిలో భాగంగా తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ రైళ్ళకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు వందే భారత్ రైళ్లు నాంపల్లి-పుణె, చర్లపల్లి-నాందేడ్ మధ్య నడవనున్నాయి. నాంపల్లి, పుణె మధ్య వందే భారత్ రైలును గతంలోనే ప్రతిపాదించగా.. తాజాగా ఆమోదం తెలిపింది. అలాగే చర్లపల్లి, నాందేడ్ మధ్య కొత్త సర్వీసుకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది. ఈ రెండు కొత్త రైళ్ల కు ఆమోదంతో హైదరాబాద్ నుంచి నడుస్తోన్న వందే భారత్ రైళ్ల సంఖ్య ఏడుకు చేరుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 2 , తిరుపతి, బెంగళూరు, నాగ్ పూర్ కు ఒక్కో వందే భారత్(Vande Bharat) ట్రైన్స్ నడుస్తున్నాయి. 600 కిలోమీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పటి వరకూ వందే భారత్ రైళ్లు కేటాయించగా.. ఈ సారి 281 కి.మీ. దూరంలో ఉన్న నాందేడ్ కు వందే భారత్ మంజూరు చేయడం ఆశ్చర్యంగా మారింది. దీనికి కారణాలు లేకపోలేదు.
మహారాష్ట్రలో ఉన్నా కూడా నాందేడ్ ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఎక్కువగా హైదరాబాద్ కే వస్తుండడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అక్కడి వ్యాపారులకు తెలంగాణతోనే వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు నిజామాబాద్ నుంచి వేల మంది ప్రతీరోజూ హైదరాబాద్ కే ప్రయాణం సాగిస్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రూట్ లో వందే భారత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
నిజానికి సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ ధర ఎక్కువగానే ఉన్నా కూడా త్వరగా గమ్యస్థానం చేరుస్తుండడంతో ప్రయాణికులు వందే భారత్ (Vande Bharat)రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. రోజురోజుకూ వీటి ఆక్యూపెన్సీ రేషియో కూడా పెరుగుతోంది. ప్రయాణికుల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం కేవలం వందే భారత్ ట్రైన్స్ సంఖ్యను పెంచడమే కాదు కొత్తగా స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టింది.