just AnalysisJust NationalLatest News

Subhash Chandra : సుభాష్ చంద్ర సెటిల్‌మెంట్ కథేంటి? అది 99.97% రాయితీనా? సామాన్యుడి జేబుకు పడిన పెద్ద కన్నమా?

Subhash Chandra : తాజాగా సుభాష్ చంద్ర ఒక వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేస్తూ.. తానేమీ సర్వస్వం కోల్పోలేదని, తన దగ్గర ఉన్న చివరి రూ. 6.5 కోట్లు ప్లాన్ ప్రకారమే చెల్లిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Subhash Chandra

మనం బ్యాంకుకు వెళ్లి ఒక ఐదు లక్షల రూపాయల హోమ్ లోన్, లేదా పర్సనల్ లోన్ ఏదైనా తీసుకుని, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని ఈఎంఐలు కట్టలేకపోయామనుకోండి. వెంటనే బ్యాంక్ సిబ్బంది మన ఇంటి తలుపు తడతారు, నోటీసులు ఇస్తారు, అప్పటికీ కట్టకపోతే చివరికి ఇల్లు వేలం వేసి పైసాతో సహా పూర్తిగా వసూలు చేసుకుంటారు.

కానీ అదే ఒక బడా పారిశ్రామికవేత్త ఏకంగా రూ. 22,006 కోట్లు ఎగ్గొట్టినా..చట్టంలోని ముసుగులు, లా లోని లొసుగులు అన్నిటిని వాడేసుకుని ఉదార స్వభావాన్ని చూపిస్తాయి. సరిగ్గా ఎస్సెల్ గ్రూప్ అధినేత, జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన తీర్పుతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోని అసలు రంగు బయటపడింది.

ఏకంగా రూ. 22,006.57 కోట్ల రుణ బకాయిలకు గాను కేవలం రూ. 6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఎన్‌సీఎల్‌టీ ఆమోదించడం చూస్తూ ఉంటే..అందరికీ మతులు పోతున్నాయి. ఈ కేసునే ఒకసారి చూస్తే ప్రతి వంద రూపాయల అప్పులో బ్యాంకులు ఏకంగా రూ. 99.97 కోల్పోతున్నాయన్న మాట. అంటే బ్యాంకులకు తిరిగి వస్తుంది రూపాయిలో 3 పైసలు కూడా కాదు. కానీ ఇక్కడ ప్రశ్నించాల్నిన సామాన్యులు అవగాహన లేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అతిపెద్ద దోపిడీ అని తెలిసినా తమ చేతకానితనంతో చూస్తూ నిలబడిపోతున్నారు.

అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే.. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు 75 ఏళ్ల సుభాష్ చంద్ర తన కంపెనీలు తీసుకున్న వేల కోట్ల రుణాలకు పర్సనల్ గ్యారెంటర్‌గా ఉన్నారు. కంపెనీలు ఆ అప్పులు తీర్చలేకపోవడంతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సుభాష్ చంద్రపై వ్యక్తిగత దివాళా కేసు వేసింది. ఈ కేసులో ఎన్‌సీఎల్‌టీ ఢిల్లీ బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిఫరెంట్ తీర్పులు ఇవ్వడంతో.. మూడో జడ్జి నీలేష్ శర్మ రంగంలోకి దిగి సెక్షన్ 114 కింద ఈ రీపేమెంట్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ ప్లాన్ ప్రకారం చూస్తే మొత్తం రూ. 6.5 కోట్లలో రూ. 6.25 కోట్లు బ్యాంకులకు పోగా, రూ. 25 లక్షలు దివాళా ప్రక్రియ ఖర్చులకు పోతాయి. అంటే దీని ప్రకారం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 1,322.39 కోట్లు రావాల్సి ఉండగా, వారికి దక్కేది కేవలం రూ. 38 లక్షలు మాత్రమే అన్నమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే రికవరీ రేటు అక్షరాలా 0.028 శాతం.

రిజల్యూషన్ ప్రొఫెషనల్ వేసిన వాల్యుయేషన్ ప్రకారం సుభాష్ చంద్ర ఆస్తుల వ్యాల్యూ ఈ రూ. 6.5 కోట్ల కంటే తక్కువేనని, ఒకవేళ కనుక ఈ ప్లాన్ తిరస్కరిస్తే ఇది కూడా రాదని ఎన్‌సీఎల్‌టీ కొత్త వాదనను తెర మీదకు తీసుకువచ్చింది. అంతేకాదు 80.81 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్‌కు ఓకే చెప్పినట్లు, కోర్టు ఈ వాణిజ్య నిర్ణయాల్లో జోక్యం చేసుకోదని కూడా స్పష్టం చేసింది. అయితే ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా, యాక్సిస్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బ్యాంకులు ఇప్పుడు ఎన్‌సీఎల్‌ఏటీకి అప్పీల్ చేసే ఆలోచనలో ఉన్నాయి.

ఈ తీర్పు తర్వాత తాజాగా సుభాష్ చంద్ర ఒక వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేస్తూ.. తానేమీ సర్వస్వం కోల్పోలేదని, తన దగ్గర ఉన్న చివరి రూ. 6.5 కోట్లు ప్లాన్ ప్రకారమే చెల్లిస్తున్నానని చెప్పుకొచ్చారు. తనకు ఒక చిన్న ఇల్లు ఉందని, దాని రెంట్‌తోనే జీవిస్తున్నానని, మళ్లీ సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి పనిచేయబోతున్నానని, స్టార్టప్‌ల కోసం ఫ్యామిలీ నుంచి రూ. 2-4 కోట్లు అప్పు తీసుకుంటానని తెలిపారు.

అంతేకాదు అసలు తానేమీ రూ. 22 వేల కోట్లు తనకోసం పర్సనల్‌గా అప్పు తీసుకోలేదని, అవి కంపెనీలు చేసిన అప్పులని సుభాష్ చంద్ర సమర్థించుకున్నారు. మరోవైపు రిలయన్స్ కంపెనీ తన మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై చేసిన ఆరోపణలను కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించగా, ఆ ఆరోపణలు అబద్ధమని, నిరాధారమైనవని రిలయన్స్ ఖండించింది.

అంతకు ముందు కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఇంగ్లాండ్‌లో ఉన్న మాజీ లిక్కర్ బారన్ విజయ్ మాల్యా ..వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన స్నేహితుడు సుభాష్‌కు అభినందనలు అని ట్వీట్ చేశారు. రూ. 6,203 కోట్ల అప్పుకు గాను బ్యాంకులు తన వద్ద నుంచి రూ. 14,100 కోట్లు రికవరీ చేశాయని.. కానీ చాలామంది బడా బాబులు మాత్రం స్వల్ప మొత్తానికే సెటిల్‌మెంట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదేనా భారతీయ రుణ పరిష్కార న్యాయం అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Subhash Chandra
Subhash Chandra

తెర వెనుక ఇంత పెద్ద మొత్తం మాయమవుతుందన్న వార్త తెలిసినా కూడా సామాన్యుడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నాడంటే..ఇదొక సిస్టమాటిక్ నెట్‌వర్క్. ఐబీసీ, హెయిర్‌కట్, పర్సనల్ గ్యారెంటర్ వంటి కాంప్లికేటెడ్ చట్టపరమైన లాంగ్వేజ్‌ను ఉపయోగించి సామాన్యుడికి విషయం అర్థం కాకుండా విషయాన్ని చెప్పీ చెప్పకుండా చెబుతున్నారు.

అందుకే తన కంపెనీ అయినా కూడా అది వేరు, తాను వేరు అని చూపిస్తూ రూ. 1260 కోట్ల విలువైన బంగ్లాలు అమ్మినా ఆ డబ్బు ఎటు పోయిందో చెప్పకుండా వ్యక్తిగతంగా ఆస్తి లేదని చూపించి ఇప్పుడు సుభాష్ చంద్ర చల్లగా జారుకుంటున్నారు. కానీ చివరకు బ్యాంకు నష్టం అంటే అది చివరికి మన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్ తగ్గడమేనని.. సర్వీస్ ఛార్జీలు పెరగడమేనని సగటు పౌరుడు గుర్తించలేకపోతున్నాడు.

ఓటింగ్ ఓకే అన్న 80 శాతం మందిలో ఎక్కువ భాగం కంపెనీకి సంబంధించిన ఫేవరబుల్ కంపెనీలే ఉంటాయి. ప్రజల సొమ్ము ఉన్న ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీలను తక్కువ ఓటింగ్‌తో ఉండటం వల్ల వాటిని పక్కకు నెట్టేస్తున్నారు. దీనికి తోడు సుభాష్ చంద్రకు సొంత మీడియా సామ్రాజ్యాలు ఉండటంతో ప్రైమ్ టైమ్ డిబేట్లలో ఈ విషయాలు రాకుండా బిజినెస్ పేజీలకే పరిమితం చేస్తున్నారు.

కొన్నేళ్లుగా 70 శాతం వరకు బ్యాంకులు నష్టపోవడాన్ని చూసి అలవాటు చేసుకున్న సామాన్యుడు, ఇప్పుడు 99.97 శాతం నష్టం వచ్చినా పెద్దగా షాక్ అవ్వని పరిస్థితికి వచ్చేశాడు. కానీ గుర్తుంచుకోవాలి.. అప్పులు ఎగ్గొట్టేవారికి మన దేశంలోని చట్టాలు ఇలాగే కొమ్ముకాస్తుంటే, ఆ భారం మొత్తం చివరికి పన్నులు కట్టే సామాన్యుడి పైనే పడుతుంది. సిస్టమ్‌ను ఎవరూ ప్రశ్నించనంత కాలం ఈ కార్పొరేట్ మాయాజాలం ఇలాగే కొనసాగుతూనే ఉంటుందనేది మాత్రం నిజం.

Fish : ఆరోగ్యానికి మంచిదని ఫిష్ తింటున్నారా?..అయితే మీరు తింటుంది చేపలు కాదు..ప్లాస్టిక్ అంటే నమ్ముతారా?

Related Articles

Back to top button