Just Andhra PradeshLatest News

AP Weather : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. 3 రోజుల పాటు ఆ జిల్లాలలో వర్షాలు

AP Weather : సముద్రంలో అలలు భయంకరంగా ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు ఎవరూ కూడా సాహసం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హోంమంత్రి హెచ్చరించారు

AP Weather

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉన్నట్టుండి బలపడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద బలంగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర అంతా వానల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతుండటంతో ఆయా జిల్లాల అధికారులను ఏపీ సర్కార్ అలర్ట్ చేసింది. ఈ అల్పపీడనం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే ఛాన్స్ ఉండగా, దక్షిణ కోస్తా ఏరియాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.

అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40 – 50 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా , ఎన్టీఆర్ జిల్లా, పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు చెప్పారు.

మిగిలిన జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణం దారుణంగా మారే సూచనలు ఉండటంతో.. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే దీనిపై అధికారులతో సమీక్షించిన హోంమంత్రి అనిత .. కీలక ఆదేశాలను జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, వాతావరణానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంత వాసులకు కూడా తెలిసేలా చేయాలని చెప్పారు.

సముద్రంలో అలలు భయంకరంగా ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లో గంటకు 50 – 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. దీంతో మత్స్యకారులు ఎవరూ కూడా సాహసం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హోంమంత్రి హెచ్చరించారు.

AP Weather
AP Weather

మరోవైపు ప్రభుత్వం దృష్టిలో మత్స్యకారుల ప్రాణ రక్షణకే తమ మొదటి ప్రయారిటీ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిపోయిన బోట్లు వెంటనే వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే లేదా సాయం కావాల్సి వస్తే 112, 1070 , 1800 425 0101 హెల్ప్‌లైన్ నంబర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

విజయవాడలో నిన్న సాయంత్రం కేవలం 40 నిమిషాల పాటు వర్షం దంచికొట్టడంతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. అటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం పడుతూనే ఉంది.

Makhana Milk : బరువు తగ్గడానికి మఖానా పాలు.. వీటి బెనిఫిట్సో తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

Related Articles

Back to top button