Bay of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడన అలజడి.. మే 16 నుంచి వర్షాలు
Bay of Bengal: ప్రస్తుతం ఎండలు మండుతున్నా సరే.. అల్పపీడనం వల్ల వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
Bay of Bengal
నైరుతితో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. విశాఖ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం చూస్తే.. అల్పపీడనానికి తోడు సముద్ర మట్టానికి దాదాపు 5.9 కి.మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ వర్షాలతో పాటు గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉండటంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
మరోవైపు నైరుతితో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాలు కూడా చాలా వేగంగా కదులుతున్నాయి. మే 16వ తేదీకి ఇవి అండమాన్ నికోబార్ దీవులతో పాటుగా దక్షిణ బంగాళాఖాతంలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు మరింత విస్తరించబోతున్నట్లు అధికారులు వివరించారు.

ప్రస్తుతం ఎండలు మండుతున్నా సరే.. ఈ అల్పపీడనం వల్ల వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. అయితే, ఈదురుగాలుల వల్ల పంటలకు, ఆస్తులకు నష్టం జరగకుండా రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసే భద్రతా జాగ్రత్తలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమని తెలిపారు.





