Sterling Silver : ప్లాటినం లుక్‌తో మెరుపు తగ్గని మన్నిక చెడని జ్యువెలరీ.. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ గురించి తెలుసా?
Sterling Silver: అసలైన స్టెర్లింగ్ సిల్వర్ నగ వెనుక భాగంలో చిన్నగా 92.5 అని కానీ S925 అనే ముద్ర కానీ ఉంటుంది. ఇది ఆ వెండి నాణ్యతకు ఇచ్చే గ్యారంటీ వంటిది.
Sterling Silver
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇప్పుడు చాలా చూపు ఒక సరికొత్త మెరుపుపై పడింది. నగలు అంటే కేవలం పసిడి, ప్లాటినమ్ మాత్రమే కాదు, దానికి దీటుగా రాజసాన్ని ఒలికించే సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతున్నాయి. అయితే సాధారణ వెండి నగలు మొదట్లో ఎంత బాగున్నా.. త్వరగా నల్లబడిపోవడం , వంగిపోవడం చూస్తుంటాం.
కానీ, కొద్ది నెలలుగా మార్కెట్‌ను ఊపేస్తున్న 92.5 స్టెర్లింగ్ సిల్వర్( Sterling Silver) మాత్రం అలా కాదు. చూడటానికి ఖరీదైన ప్లాటినం లేదా వైట్ గోల్డ్ లా మెరుపులు చిందిస్తూ..సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. సిల్వర్ ఓకే కానీ ఈ స్టెర్లింగ్ సిల్వర్( Sterling Silver) ఏంటి? అందులోనూ 92.5 స్టెర్లింగ్ సిల్వర్ అంటే ఏంటన్న ప్రశ్న చాలా మందిలో వినిపిస్తోంది. అంతేకాదు ఇది సాధారణ వెండి కంటే ఎందుకు ఖరీదైనదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మనం రెగ్యులర్‌గా వాడే ప్యూర్ వెండి (99.9%) చాలా మెత్తగా ఉంటుంది. దానితో సన్నని డిజైన్లు ఉన్న జ్యువెలరీ చేస్తే అవి త్వరగా విరిగిపోతాయి. అందుకే వెండికి కొంచెం దృఢత్వాన్ని ఇవ్వడం కోసం 92.5 శాతం స్వచ్ఛమైన వెండికి, మిగిలిన 7.5 శాతం రాగి కానీ ఇతర లోహాలను కానీ కలుపుతారు.
ఇలా వెండితో కలిపిన లోహాల ఈ మిశ్రమాన్నే ప్రపంచవ్యాప్తంగా స్టెర్లింగ్ సిల్వర్ అని పిలుస్తారు. దీనివల్ల నగలు గట్టిగా ఉండటంతో పాటు, డైమండ్స్ లేదా ఇతర రత్నాలను వీటిలో పొదగడానికి చాలా అనువుగా ఉంటాయి. అందుకే ప్రస్తుతం వచ్చే బ్రాండెడ్ జ్యువెలరీ, రింగ్స్, బ్రాస్లెట్స్, పట్టీలు అన్నీ ఈ స్టెర్లింగ్ సిల్వర్తోనే తయారవుతున్నాయి.

ఈ స్టెర్లింగ్ జ్యువెలరీని గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. అసలైన స్టెర్లింగ్ సిల్వర్ నగ వెనుక భాగంలో చిన్నగా 92.5 అని కానీ S925 అనే ముద్ర కానీ ఉంటుంది. ఇది ఆ వెండి నాణ్యతకు ఇచ్చే గ్యారెంటీ వంటిది. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, చర్మంపై ఎలాంటి అలర్జీలు కూడా రాకుండా రక్షణ ఇస్తాయి.
ఆభరణాల ప్రియులకు తక్కువ ధరలో ఎక్కువ రిచ్ లుక్ ఇచ్చే ఈ స్టెర్లింగ్ సిల్వర్ నగలు, బంగారం ధరలు ఆకాశానికి అంటడంతో ఇప్పుడు పెట్టుబడిగా కూడా మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. అందుకే మీ దగ్గర కూడా ఇలాంటి నగలుంటే, అది కేవలం వెండి మాత్రమే కాదు.. అది మీ స్టైల్ స్టేట్మెంట్ అని ఎదుటివారు గుర్తించేలా ఉంటాయని అంటున్నారు స్టైలిస్ట్‌లు.
Ekamukhi Rudraksha : అసలైన ఏకముఖి రుద్రాక్ష ఎలా ఉంటుంది?. నకిలీల గుర్తింపు ఎలా?





