Verve 102
ఇప్పుడు వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య హై కొలెస్ట్రాల్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల గుండె ధమనులు మూసుకుపోయి హార్ట్ ఎటాక్స్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కోసం చాలామంది జీవితకాలం పాటు ప్రతిరోజూ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తోంది.
అయితే ఈ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ చూపిస్తూ వైద్య రంగంలో సరికొత్త విప్లవం వచ్చింది. కేవలం ఒకే ఒక్క డోస్‌తో కొలెస్ట్రాల్‌ను పూర్తి స్థాయిలో తగ్గించే వెర్వ్ 102(Verve 102) అనే ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌లో ది బెస్ట్ అనేలా మంచి ఫలితాలను సాధించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ, దాని అనుబంధ సంస్థ వెర్వ్ థెరప్యూటిక్స్ కలిసి డెవలప్ చేసిన ఈ మెడిసిన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మొదటి ఆసక్తికరమైన నిజం ఏంటంటే.. వెర్వ్ 102 (Verve 102) అనేది సాధారణంగా వేసుకునే ఇతర టాబ్లెట్లు లేదా మందుల వంటిది కాదు. ఇది అత్యంత అధునాతనమైన జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో పనిచేసే ఒక సరికొత్త జన్యు చికిత్స. అంటే కొలెస్ట్రాల్ ఉత్పత్తికి కారణమయ్యే శరీరంలోని ఒక నిర్దిష్ట జన్యువును ఇది పర్మినెంట్‌గా మార్చేస్తుంది. దాదాపు నాలుగు గంటల పాటు సెలైన్ ఇన్ఫ్యూషన్ రూపంలో ఈ ఇంజెక్షన్‌ను నరాల ద్వారా రోగి శరీరంలోకి ఎక్కిస్తారు.
రెండో నిజం వెర్వ్ 102 పనితీరుకు సంబంధించింది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయంలో ఉండే పీసీఎస్‌కే9 అనే జన్యువు వల్ల.. ఒక రకమైన ప్రోటీన్ తయారవుతుంది. ఈ ప్రోటీన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను క్లియర్ చేసే రిసెప్టర్లను నాశనం చేస్తుంది. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. వెర్వ్ 102 ఇంజెక్షన్ డైరెక్టుగా కాలేయంలోని ఆ జన్యువును టార్గెట్ చేసి, దాన్ని పర్మినెంట్‌గా ఇనాక్టివేట్ చేస్తుంది.
మూడో నిజం ఏంటంటే.. దీని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు. వంశపారంపర్యంగా వచ్చే కొలెస్ట్రాల్ సమస్య, గుండె జబ్బులు ఉన్న రోగులపై ఈ వెర్వ్ 102 ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ మెడిసిన్‌ను గరిష్ట మోతాదులో తీసుకున్న రోగులలో కొలెస్ట్రాల్‌ను పెంచే ప్రోటీన్ స్థాయిలు ఏకంగా 88 శాతం పడిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే కేవలం ఒకే ఒక్క డోస్ ద్వారానే బ్లడ్‌లోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గరిష్టంగా 62 శాతం వరకు తగ్గినట్లు తేల్చారు.
నాల్గవ నిజం దీని ప్రభావం ఉండే కాలపరిమితి. సాధారణంగా కొలెస్ట్రాల్ గురించి మెడిసిన్ వాడటం ఆపేస్తే మళ్లీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కానీ వెర్వ్ 102 ఇంజెక్షన్ తీసుకున్న వారిలో తగ్గిన కొలెస్ట్రాల్ స్థాయిలు సుమారు 18 నెలల పాటు తక్కువగానే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది డైరెక్టుగా డీఎన్‌ఏను మార్చే చికిత్స కాబట్టి, ఈ ఎఫెక్ట్ జీవితకాలం పాటు ఇలాగే కొనసాగే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.
ఇక ఐదో నిజం మాత్రం దీని దుష్ప్రభావాలకు సంబంధించింది. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి ఎలాంటి ప్రాణాపాయం లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఈ పరిశోధన తేల్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన సమయంలో కొంచెం ఒంటి నొప్పులు, జ్వరం, నీరసం వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపించాయి. కాబట్టి ఇది మనిషి శరీరానికి పూర్తిగా సురక్షితమైనదేనని ప్రాథమికంగా ప్రూవ్ అయింది.
భారత్ వంటి దేశాల్లో యూత్ కూడా గుండెపోటు బారిన పడుతున్న సమయంలో ఈ ఆవిష్కరణ ఎంతో ఇంపార్టెన్స్ సంతరించుకుంది. రోజూ టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయే వాళ్లకు, మందులు వాడి విసిగిపోయిన వాళ్లకు ఈ సింగిల్ షాట్ థెరపీ ఒక సంజీవని వంటిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్ ట్రయల్స్ మాత్రమే కాబట్టి, రాబోయే రోజుల్లో ఎక్కువ మందిపై పరిశోధనలు జరిపి దీని సేఫ్టీని పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది. ఆ తర్వాతే వెర్వ్ 102 ఇంజెక్షన్‌ను పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
