Sudan : తీవ్ర స్థాయికి సూడాన్ సంక్షోభం..ఘోరవిపత్తు చూడబోతున్నామా ?
Sudan : ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో అంతర్యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన దశకు చేరుకుంది. మూడేళ్లుగా అక్కడ అధికార సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు యుద్ధం కొనసాగుతూనే ఉంది.
Sudan
ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు సాధారణమే. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇవి త్వరగానే సద్దుమణిగినా మరికొన్ని సార్లు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికా దేశమైన సూడాన్(Sudan) లో అంతర్యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన దశకు చేరుకుంది. మూడేళ్లుగా అక్కడ అధికార సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కు యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఇప్పటి వరకూ 1.1 కోట్లకు పైగా ప్రజలు ఈ యుద్ధం కారణంగా రోడ్డున పడినట్టు ఐక్యరాజ్యసమితి నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ఆహార సంక్షోభంగా చెబుతున్నారు. గాజాలో జరుగుతున్న దాడుల కంటే సూడాన్ లోని మారణహోమమే భయంకరంగా ఉందంటున్నారు.
దేశ సైనిక విభాగాల మధ్య చెలరేగిన ఈ అధికార పోరాటం తీవ్రమైన అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ హింసాత్మక ఘర్షణల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కరవు బారిన పడ్డారు.పారామిలిటరీ బలగాలను దేశ అధికారిక సైన్యంలో విలీనం చేసే ప్రక్రియపై రెండు వర్గాల నాయకుల మధ్య వచ్చిన తీవ్ర విభేదాలే ఈ యుద్ధానికి కారణం.
దశాబ్దాలుగా సైనిక పాలకుల చేతుల్లో ఉన్న సూడాన్(Sudan)లో, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ విఫలం కావడం కూడా దీనికి మరో కారణంగా నిలిచింది. అంతర్యుద్ధం కారణంగా దాదాపు 50 లక్షల మంది చాడ్, దక్షిణ సూడాన్, ఈజిప్ట్ వంటి పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.
దేశంలో సగానికి పైగా జనాభా (సుమారు 2.5 కోట్ల మంది) తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాలలో కరవు తాండవిస్తోందని ఐక్యరాజ్యసమితి సైతం ధృవీకరించింది.ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 1,50,000 కంటే ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా వేసింది.

చాలా నగరాల్లో పౌరులపై దాడులు,మహిళలపై లైంగిక దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంతర్యుద్ధానికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న సంస్థలపై ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు.
సూడాన్(Sudan) దళాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేసిందనే ఆరోపణలపై భారత్ కు చెందిన ఒక కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. సంక్షోభాన్ని నివారించేందుకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సైనిక ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పట్టుబడుతుండటంతో చర్చలు విఫలమవుతున్నాయి. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ చరిత్రలోనే దారుణమైన విపత్తు చూస్తామని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
France : ఎండ తీవ్రతతో ఫ్రాన్స్ ఉక్కిరిబిక్కిరి..ఏసీల కోసం కొట్టుకుంటున్న ప్రజలు





