Just InternationalLatest News

Hormuz : ఇరాన్ డ్రోన్లపై అమెరికా వైమానిక దాడులు..హర్మూజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం పెరుగుతుందా?

Hormuz : అమెరికాలో త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల వల్ల తమ దేశం ఒత్తిడికి గురవుతుందని ఇరాన్ తప్పుగా అంచనా వేస్తోందని, కానీ దేశ భద్రత ముందు తమకు ఎన్నికలు ముఖ్యం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు.

Hormuz

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌ కంట్రీతో దౌత్యపరమైన శాంతి చర్చలను జరుపుతున్నామని చెబుతూనే.. మరోవైపు అమెరికా రక్షణ దళాలు మాత్రం ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది.

హర్మూజ్ (Hormuz ) జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలను వ్యూహాత్మకంగా టార్గెట్ చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కొన్ని డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా రక్షణశాఖ అఫీషియల్‌గా ప్రకటించింది. హర్మూజ్ ప్రాంతంలో తమ సైనికులకు , నౌకలకు ముప్పు పొంచి ఉందనే ముందస్తు సమాచారంతోనే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ వైమానిక దాడులు చేపట్టాల్సి వచ్చిందని ఎనౌన్స్ చేసింది. .

అయితే ఇరాన్‌తో జరుగుతున్న చర్చల ప్రక్రియపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా రియాక్టయ్యారు. శాంతి చర్చలు గనుక విఫలమైతే తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ, అవసరమైతే తమ రక్షణ మంత్రిని డైరెక్టుగా రంగంలోకి దించి అనుకున్న పని పూర్తి చేస్తామని హెచ్చరించారు.

అమెరికాలో త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల వల్ల తమ దేశం ఒత్తిడికి గురవుతుందని ఇరాన్ తప్పుగా అంచనా వేస్తోందని, కానీ దేశ భద్రత ముందు తమకు ఎన్నికలు ముఖ్యం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రపంచ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకునే తాము పనిచేస్తున్నామన్న డొనాల్డ్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వాయుధాలను సాధించకూడదన్నదే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఇరాన్ పాలకులు అమెరికాతో ఒక ఒప్పందానికి రావాలని ఆశిస్తున్నామని, ఇప్పటివరకు ఆ దిశగా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చివరికి అంతా అనుకూలంగానే మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

America - Iran
America – Iran

అంతర్జాతీయ జలమార్గమైన హర్మూజ్(Hormuz ) జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మార్గం ప్రపంచ దేశాలన్నింటికి కూడా చెందుతుందని.. దీనిపై ఏ ఒక్క దేశానికి కూడా పూర్తి కంట్రోల్ ఉండటానికి వీల్లేదని..అలాగే తాము కేవలం అక్కడ పర్యవేక్షణ మాత్రమే చేస్తామని ట్రంప్ చెప్పారు.

ఇదే సమయంలో ఈ చర్చల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని ఒమన్‌కు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోని మిగతా దేశాలలాగానే ఒమన్ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, లేకపోతే అమెరికా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది. యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా తన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడమే కాదు..గల్ఫ్ రీజియన్ నుంచి తన సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.

రాబోయే 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని, ఈ ప్రాంతంలో నౌకల పర్యవేక్షణ బాధ్యతలను ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా బ్యాలెన్స్ చేసుకుంటాయని వెల్లడించింది.

 Hormuz
Hormuz

అయితే ఇరాన్ మీడియా ప్రసారం చేసిన ఈ వార్తలను అమెరికా వైట్ హౌస్ ఖండించింది. అవన్నీ కేవలం ఫేక్ న్యూస్‌లని, రెండు దేశాల మధ్య ఎలాంటి టెంపరరీ ఒప్పందాలు కుదరలేదని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వాణిజ్య మార్గంగా ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలివెళ్లే భారీ ముడి చమురు, గ్యాస్ రవాణా అంతా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధ వాతావరణం ఏర్పడితే, అది అంతర్జాతీయంగా చమురు ధరలపై తక్షణ ప్రభావం చూపుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఒకపక్క శాంతి చర్చల ప్రతిపాదనలు కొనసాగుతుండగానే.. మరోపక్క సైనిక దాడులు , హెచ్చరికలతో పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర అస్థిరత వైపు వెళ్తుండటంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button