Dhanush:అవును నిజమే ..మనకూ ఓ ధనుష్ ఉన్నాడు !
Dhanush:ఈమధ్య సోషల్ మీడియాలో ఒక ప్రశ్న సర్క్యులేట్ అవుతూ వస్తుంది.కుబేర సినిమాలో ధనుష్ పాత్రలో నటించగల నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా అని

Dhanush:ఈమధ్య సోషల్ మీడియాలో ఒక ప్రశ్న సర్క్యులేట్ అవుతూ వస్తుంది.కుబేర సినిమాలో ధనుష్ పాత్రలో నటించగల నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా అని ! ప్రశ్న ఎవరిదైనా కావచ్చు కానీ సమాధానాలు మాత్రం కొంత విచిత్రంగానే వచ్చాయి.. ఎందుకో ఆ ప్రశ్నను చాలా సీరియస్ గా తీసుకోవాలి అని నాకు అనిపించింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు.. కుబేర సినిమాలో ధనుష్ పోషించిన పాత్ర ఒక బిక్షగాడి పాత్ర కావటం ధనుష్ నటనతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఆ పాత్రకు తగ్గట్లు సరిపోవడం తో చాలా మంది విమర్శకులు ఆ పాత్రను ధనుష్ అద్భుతంగా పోషించారు అనే అభిప్రాయం తమ సమీక్షలలో వ్యక్తం చేశారు. సంతోషం .. కానీ తెలుగులో ఆ పాత్ర చేయగల నటులే లేరు అన్న హోల్సేల్ అభిప్రయానికి వీరిలో చాలా మంది చాలా తేలికగా రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. మంచి నటులు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు అయితే ధనుష్ అంత వైవిధ్యం ఉన్న పాత్రలు ఎంచుకోగలిగే ధైర్యం ఉన్న నటులు మాత్రం తక్కువ ఉన్నారు.
Dhanush
ఇంకా లోతుగా చెప్పాలి అంటే వర్తమానంలో ఉన్న సినిమా బిజినెస్ కమర్షియల్ వాల్యూ నటనని, నటుడిని, నటుడికి అవసరమైన ధైర్యాన్ని కూడా చంపేశాయి . ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ధనుష్(Dhanush) లాంటి నటులను చిత్ర పరిశ్రమ ప్రసవించకుండానే కొంత మంది బ్రూణ హత్యలకు కారణం అయ్యారు అని చెప్పాలి.
కాస్త వెనక్కి వెళితే 2000 దశకంలో తెలుగులో “ప్రాణం” అనే సినిమా వచ్చింది అందులో అల్లరి నరేష్(Alla Naresh) పల్లెటూరు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో గాలిసీను పాత్రలో గమ్యం.. నాంది.. మారేడుమిల్లి, బచ్చలమల్లి లాంటి సినిమాలలో నరేష్ తనలో కూడా ధనుష్ ఉన్నాడు అనే విషయాన్ని బయటపెట్టుకునే ప్రయత్నాలు చాలానే చేశారు. కానీ అతని ఆశలు నెరవేరలేదు. అతను ఊహించిన సహజ నటన పాత్రలు మెప్పించినా తరువాత మాత్రం అమానవీయంగా కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే అల్లరి నరేష్ తలుపు తట్టాయి అంటే అది బహుశా ఆయన సమస్య కాకపోవచ్చు!
ఒక జాతీయ స్థాయి నటుడుని, పాత్ర పోషిస్తే ఆ పాత్ర తప్ప హీరోలు, హీరో ఇజాలు కనిపించని ఒక మంచి నటుడిని కేవలం వెర్రి నవ్వులు వేసి వెకిలిగా నవ్వించే కామెడీ వేషాలకే పరిమితం చేయాలి అనుకోవడం మన దురదృష్టం. ఈ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుని తిరిగే దేశంలో తెలుగు సినిమా పరిశ్రమకే ఇలాంటి సంస్కృతి చెల్లుతుంది అని చెప్పాలి.. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇదే దుర్మార్గమైన తెలుగు ప్రేక్షకులు కుబేర అనే హాఫ్ బాయిల్డ్ సినిమా చూసి ధనుష్ పాత్ర వేయడానికి మన దగ్గర ఎవరూ సరిపోరు అనే సామూహిక హిపోక్రసీని సోషల్ మీడియా పీతి డొంకల్లో ప్రదర్శించటం ఎంత వరకు సబబు?
మీకు వెకిలి నవ్వులు కావాలి అన్నప్పుడల్లా అల్లరి నరేష్ కావాలి. అదే మంచి పాత్రలు ఉన్న సినిమా వస్తుంది అంటే మాత్రం చెన్నై విమానం ఎక్కాలి. చెప్పుకోవడానికి ఒక్కడికీ పుస్తకం చదివే అలవాటు లేని మన దర్శకులు ఎలా మన నటులలోంచి ధనుష్ లను బయటకు తీయగలరు ?
తమిళంలో సహజ నటన ప్రదర్శించే ధనుష్ లాంటి గొప్ప నటులు మనకు కమర్షియల్ గా వర్కవుట్ అవుతారు అన్న ధైర్యం ఉంది కానీ మన పక్కనే ఉన్న ఒక అల్లరి నరేష్, సుహాస్, సత్యదేవ్ లకు సీరియస్ పాత్రలు ఇవ్వొచ్చు అన్న ధైర్యం మాత్రం మనకు రాదు ! ఎందుకంటే మనలో ఉన్న సృజన మీద మనకు నమ్మకం లేదు. మన ఆలోచనకు పక్క రాష్ట్రం నటుడు తోడైతే మాత్రమే అది కమర్షియల్ గా పండుతుంది అన్న ఒక మోటు లెక్క కట్టి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితికి వచ్చింది. దానివలనే ఊపిరి సినిమాలో కార్తీ, కుబేర సినిమాలో ధనుష్ పాత్రలలో మన వాళ్ళని చూసే అవకాశాన్ని మనమే వదులుకున్నాము.
ఒకవేళ అల్లరి నరేష్ కుబేర సినిమాలో ధనుష్ పాత్ర పోషించి ఉంటే బహుశా మనం ఇంత గొప్పగా, ఇంత విశాలంగా, ఇంత రెడీమేడ్ గా స్పందించే వాళ్లం కాదేమో. ఎందుకంటే మనలో లోపల ఎక్కడో ఒక చులకన “మన వాళ్ళకు అంత సీను లేదులే” అనే నిశ్చిత అభిప్రాయం. పరాయి నటన మీద ప్రేమలతో మందపు ఇనుప పొరలు కమ్మిన మన సినిమా కళ్లను అమాంతం తెరిచే ధైర్యం కూడా మనకు లేదు !
అందుకే నేను ఇప్పుడు కోరుకునేది ఒక్కటే బ్రూణ హత్యలు ఎంత పాపమో నట బ్రూణ హత్యలు చేస్తున్న తెలుగు సినిమా దర్శకులు, వాటిని చూసీ చూడనట్లు చూసి పక్క రాష్ట్రం ఉత్తమ హీరోల మోజులో పడి చంకలు గుద్దుకుంటున్న సినిమా అభిమానులది కూడా అంతే పాపం.
ఇంకొన్ని ఇటీవల కాలంలో జరిగిన హత్యాకాండలను కూడా మీకు గుర్తు చేస్తాను. హీరో నాని అనే వ్యక్తి నటించే అవకాశం ఉన్నా పాత్రల నుంచి తప్పుకుని నేను కమర్షియల్ హీరో మాత్రమే అని చెప్పుకొని తిరుగుతున్నాడు. సెల్ఫ్ మేడ్ విజయ్ దేవరకొండ లాంటి నటుడు కూడా నటన పక్కన పెట్టి కమర్షియల్ ఈక్వేషన్స్ లో పెద్ద దర్శకుల ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి నట బ్రూణ హత్యలకు కారణం మనమే అని తప్పు ఒప్పుకుని ధనుష్ సినిమా చూసి అన్ని మరచిపోవాల్సిన క్షణాలు ఇవి.
కేవలం నటులను మాత్రమే కాదు దర్శకులని అలానే మనం కమర్షియల్ రోడ్డు ప్రమాదాలకు గురిచేశాం. నీలకంఠ, కృష్ణ వంశీ, క్రిష్, పూరి, సునీల్ కుమార్, ఊడుగుల వేణు, ఇలా చాలా మందిని కళ్లారా చెడగొట్టడమే కాకుండా పొట్టన పెట్టుకున్నాం. మన కమర్షియల్ రక్త దాహంలో..
మంచి దర్శకుడు KNT శాస్త్రి చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది
“ఈరోజు తెలుగు సినిమా అంటే తడి కాదు ఒక శబ్ధం అది డబ్బులు రాలిన శబ్ధం” అని
పక్క రాష్ట్రం ధనుష్ మహా నటుడే కాదని అనే ధైర్యం మనం ఎవరూ చేయలేం..కానీ ఇప్పటికైనా మన ధనుష్ లు అల్లరి నరేష్, సుహాస్(Suhas), సత్యదేవ్)Satyadev) లను గుర్తిద్దాం కొంచెం వాళ్లకి కూడా ఊపిరులు ఊదుదాం !
….
Kranthi