Just Andhra PradeshLatest News

Pensioners: ఏపీ పెన్షనర్లకు అలర్ట్.. మీ ఫోన్‌కు కాల్ వస్తే వెంటనే స్పందించండి..

Pensioners: కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై కొన్ని ప్రతికూల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

Pensioners

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ (Pensioners)తీసుకుంటున్న కోట్లాది మంది లబ్దిదారులకు.. కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమాచారాన్ని చెబుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 18 నెలలు గడుస్తోంది. అధికారంలోకి వచ్చి న వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద రెగ్యులర్‌గా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ప్రారంభంలో మూడు నెలల పెన్షన్ కలిపి ఇవ్వడమే కాకుండా, చాలా రకాల పింఛన్లను డబుల్ చేస్తూ లబ్దిదారులకు అండగా నిలుస్తూ వస్తోంది

అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై కొన్ని ప్రతికూల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం పెన్షన్ల సంఖ్యను తగ్గించేసిందని, అర్హులైన వారిని కూడా జాబితా నుంచి తొలగిస్తోందని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి .అయితే అలా వస్తున్న వార్తలను అబద్ధమని నిరూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేరుగా లబ్దిదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం అంటే ఐవీఆర్ఎస్ సర్వేను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ సర్వే ప్రక్రియలో భాగంగా రాబోయే పది రోజుల్లో ఏపీ పెన్షన్(Pensioners) లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి నేరుగా ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ కాల్ వచ్చినప్పుడు పెన్షనర్లు చాలా జాగ్రత్తగా స్పందించాలి . ఈ సర్వేలో ముఖ్యంగా మూడు ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న మీకు పెన్షన్ ఇచ్చే సమయంలో ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా లేదా పెన్షన్ పేరుతో వేరే అవినీతికి పాల్పడుతున్నారా అని అడుగుతారు.

ఒకవేళ ఏ ఇబ్బంది లేకపోతే ఒకటి అని, అవినీతి జరుగుతుంటే రెండు నొక్కాల్సి ఉంటుంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఎంత పారదర్శకంగా ఉందో ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తేలితే ఆ ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Pensioners
Pensioners

రెండో ప్రశ్న పెన్షన్ పంపిణీ సమయం మరియు విధానం గురించి ఉంటుంది. ప్రతి నెలా ఒకటో తేదీనే మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తున్నారా అని ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతుంది. అవును అయితే ఒకటి అని, లేదు అయితే రెండు మీద ప్రెస్ చేయాలి.

అలాగే మూడవ ప్రశ్న పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్ లేదా సచివాలయ ఉద్యోగి మీతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారా లేదా అని అడుగుతుంది. వారి ప్రవర్తన బాగుంటే ఒకటి అని, బాగోలేదని మీరు భావిస్తే రెండు అని నొక్కాలి.

కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వృద్ధులు , వికలాంగులు సచివాలయాల చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీని కొనసాగిస్తోంది. ఈ ప్రశ్నకు లబ్దిదారులు ఇచ్చే సమాధానాల ఆధారంగా పంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సర్వే ద్వారా ప్రజలదే తుది నిర్ణయం అని ప్రభుత్వం చెబుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడమే కాకుండా, పెన్షన్ పంపిణీలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని కూడా ఈ సర్వే ద్వారానే ప్రభుత్వం గుర్తించడానికి నిర్ణయం తీసుకుంది. కొందరికి మూడు ప్రశ్నలు అడగొచ్చు, మరికొందరికి కేవలం ఒకటో రెండో ప్రశ్నలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మీ ఫోన్‌కు కాల్ వచ్చినప్పుడు ఎటువంటి కంగారు పడకుండా, నిజాలను ధైర్యంగా చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ సర్వే తర్వాత పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని కీలక మార్పులను చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ (Pensioners)అందుతుంది. పింఛన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ ఐవీఆర్ఎస్ సర్వే ఒక వారధిలా పనిచేస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button