Just Andhra PradeshJust Political

ap : గులకరాయి కేసు నిందితుడు సతీష్ మిస్సింగ్ వెనుక..

ap : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకానొక దశలో కుదిపేసిన ఒక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ap : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకానొక దశలో కుదిపేసిన ఒక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ కుమార్ ఆచూకీ లభ్యమైంది. ఇంటి నుంచి అదృశ్యమైన సతీష్, సుదూరంలోని కడపలో ఉన్నట్లు విజయవాడ పోలీసులు గుర్తించారు.

ap

వేముల సతీష్ కుమార్ ఈ నెల 17న రాత్రి విజయవాడ(Vijayawada)లోని తన నివాసంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రపోయాడు. అయితే, 18న ఉదయం సతీష్ ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో, ఈ నెల 20న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ అదృశ్యం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదా ప్రేమ వ్యవహారమే కారణమా అనే కోణంలో పోలీసులు మొదట అనుమానించారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు కాబట్టి, సతీష్ అదృశ్యం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. సతీష్ కడపలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని అక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో సతీష్‌ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడి ఆచూకీ దొరకడం, తిరిగి ఇంటికి రావడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆనందంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు మందలించడంతోనే సతీష్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అతని లాయర్ సలీమ్ వెల్లడించారు.

కాగా వేముల సతీష్ కుమార్ (Vemula Satish Kumar) పేరు 2024 ఎన్నికల సమయంలో ఏపీ వ్యాప్తంగా మారుమోగింది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan), ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 రాత్రి విజయవాడ అజిత్ సింగ్ నగర్(Ajit Singh Nagar), వివేకానంద స్కూల్ సెంటర్ వద్ద జగన్ బస్సుపై ఉండగా, రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో వైఎస్ జగన్ ఎడమ కంటికి స్వల్ప గాయమైంది. అంతేకాదు, ఆయన పక్కనే ఉన్న అప్పటి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయాలు తగిలాయి.

ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. పోలీసులు వేముల సతీష్ కుమార్‌ను నిందితుడిగా అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. అయితే దీనిపై 300 రూపాయలు ఇస్తారంటే వచ్చానని..అనవసరంగా తనను కేసులో ఇరికించారంటూ సతీష్ ఆరోపించగా.. ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉందా లేదా అనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా సతీష్ కనిపించకుండా పోవడం, ఆ తర్వాత దొరకడం.. వ్యక్తిగత కారణాలతోనే అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడని తేలడంతో ఈ ఎపిసోడ్‌కు తెరపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button