Rowdy Sheeters
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల విషయంలో తన వైఖరిని చాలా స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో రౌడీయిజం(Rowdy Sheeters), గూండాయిజం లేదా గంజాయి బ్యాచ్‌ల ఆటలు సాగనిచ్చేది లేదని పోలీసు అధికారులకు గట్టిగా ఆదేశాలిచ్చారు. తాజాగా జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
ఎవరైనా పద్ధతి మార్చుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడితే, వారిని ఏకంగా రాష్ట్రం నుంచే బహిష్కరించాలని (Externment) చంద్రబాబు సూచించారు. అంటే ఇకపై రౌడీషీటర్లు కేవలం జైలుకు వెళ్లడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 9 వేల మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. వీరిని పోలీసులు మూడు కేటగిరీలుగా విభజించారు. ‘A’ కేటగిరీలో హత్యలు, హత్యాయత్నాలు మరియు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారు ఉంటారు.’B’ కేటగిరీలో దొంగతనాలు, డ్రగ్స్ సప్లై చేసేవారు ఉండగా, ‘C’ కేటగిరీలో చిన్న చిన్న నేరాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఉన్నారు.
వీరిలో దాదాపు 1500 మందిని అత్యంత ప్రమాదకరమైన నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా , గోదావరి జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉందని సమాచారం. రిపీటెడ్‌గా నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది.
అయితే ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద రాజకీయ చర్చ కూడా జరుగుతోంది. రౌడీషీటర్ల(Rowdy Sheeters) బహిష్కరణ అనేది చట్టబద్ధంగా సాధ్యమేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా ఒక నేరస్తుడిని ఒక ప్రాంతం లేదా జిల్లా నుంచి బహిష్కరించే అధికారం పోలీసులకు ఉంటుంది, కానీ రాష్ట్రం నుంచే పంపించడం అనేది న్యాయపరమైన ప్రక్రియతో కూడుకున్న పని.
గతంలో ఇలాంటి చర్యలు చాలా అరుదుగా జరిగాయి. అలాగే, రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కుతోంది. రౌడీషీటర్ల(Rowdy Sheeters)లో చాలామందికి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉంటాయి. అధికార పార్టీ తమకు నచ్చని వారిని టార్గెట్ చేసి బహిష్కరణ వేటు వేస్తుందా? అనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా శాంతిభద్రతలకే ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. ప్రజలకు రక్షణ కల్పించడమే తమ మొదటి లక్ష్యమని, నేరస్తులకు ఏ పార్టీ అండ ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేస్తోంది.
ఏపీని ఇన్వెస్ట్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలంటే ముందుగా నేరాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న నోటోరియస్ రౌడీల జాబితాను సిద్ధం చేశారు.
వీరికి త్వరలోనే వార్నింగ్‌లు ఇచ్చి, వినకపోతే బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ లాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో రౌడీయిజంపై యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.
