AP : ఏపీలో స్వాతంత్య్ర వేడుకల వేదిక మార్పు
AP : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది.

AP : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దకాలంగా నిరీక్షిస్తున్న అమరావతి రాజధానిలో తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఎక్కడైనా సరే రాష్ట్ర రాజధానిలోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల(Independence celebrations)ను నిర్వహించడం ఒక సంప్రదాయం. అయితే, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, అమరావతిని కొత్త రాజధాని(Amaravati capital)గా ఎంపిక చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించారు.
AP
అయితే, ఆ సమయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అనువైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో, ప్రతి సంవత్సరం విజయవాడ(Vijayawada)లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహిస్తూ వచ్చారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో, అలాగే 2019 నుండి 2024 వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఇదే స్టేడియం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వేదికగా కొనసాగింది.
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అమరావతి రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాధాన్యతను, దాని ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికలో మార్పు అనేది నిజంగా ఒక చారిత్రక నిర్ణయమే.
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సచివాలయం వెనుక భాగంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
దీనిని ఒక గొప్ప వేడుకగా జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు కూటమి పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) నాయకులు ఈ వేదికపై కనువిందు చేయనున్నారు. ఈ వేడుక సందర్భంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు తిరిగి ఊపందుకున్నాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారు.
ప్రస్తుతం వేలాది మంది కార్మికులు, సిబ్బంది, అధికారులు అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూముల్లో కూడా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు, అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు.