Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?
Arava Sridhar: సామాజిక బహిష్కరణ భయం, పోలీసుల దగ్గరకు వెళ్తే వచ్చే అవమానం బాధితుల గొంతు నొక్కేలా చేస్తాయి.
Arava Sridhar
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్(Arava Sridhar)పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక సామాన్య మహిళ ప్రజాప్రతినిధిపై చేస్తున్న ఆరోపణలు, దానికి సంబంధించి విడుదలైన వీడియోలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యాయి.
ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికగా హింసించారని,పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐదు సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించారని ఆమె ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Arava Sridhar)..సదరు మహిళే తనను వేధిస్తోందని ప్రత్యారోపణలు చేశారు. అటు సోషల్ మీడియాలోనే రెండువర్గాలుగా చీలిపోయి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇది వైసీపీ పక్కా స్కెచ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమయినా దీని వెనుక వైసీపీ నేతల హస్తం కూడా ఉందన్న వాదన అయితే మాత్రం బలంగా వినిపిస్తోంది.
మరోవైపు జనసేన పార్టీ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని కూడా నియమించింది.టీ. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ. వరుణ్ నేతృత్వంలోని ఈ కమిటీ 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచు తమ పార్టీ చిత్తశుద్ధిని చాటుకుంది.
అయితే రాజకీయాల్లో లైంగిక ఆరోపణలనేవి ఒక తుపాను వంటివి. ఇవి వచ్చినప్పుడు వ్యవస్థలన్నీ కదిలిపోతాయి. కానీ ఆ తుపాను వెనుక దాగి ఉన్న బాధితుల వేదన, సమాజం వేసే ప్రశ్నలు, అధికార గర్వం వంటి అంశాలను మాత్రం ఎప్పటికప్పుడు లోతుగా విశ్లేషించాల్సి ఉంది.
నిజానికి ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం అధికార అసమానత అంటున్నారు సైకాలజిస్టులు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు అపారమైన డబ్బు, పేరు, వ్యవస్థలపై పట్టు కలిగి ఉంటారు. బాధితులు సాధారణంగా మధ్యతరగతి , ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతో, అధికారం ఉన్న వ్యక్తులు భయం లేదా ప్రలోభం ద్వారా వారిని లొంగదీసుకుంటారు.
పవర్, అవకాశాలకు బాధితుల మౌనం కలిసినప్పుడు ఇలాంటి దుర్వినియోగానికి మార్గం ఏర్పడుతుంది. ఇక ఈ విషయానికి వస్తే బాధితురాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ఫేస్బుక్ ద్వారా మొదలైన పరిచయం ఎలా తన జీవితాన్ని నరకంగా మార్చిందో వివరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడం వల్లే.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని చెప్పారు
మరి ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఒక బాధితురాలి కోణం నుంచి ఆలోచిస్తే దీనికి చాలా బలమైన కారణాలు ఉంటాయి. బాధితులు తమపై జరిగిన అన్యాయాన్ని తమ తప్పుగానే భావిస్తూ గిల్ట్ ఫీలింగ్‌లో ఉంటారు. దీనికి తోడు సామాజిక బహిష్కరణ భయం, పోలీసుల దగ్గరకు వెళ్తే వచ్చే అవమానం వారిని గొంతు నొక్కేలా చేస్తాయి.
రాజకీయ నేతలపై ఫిర్యాదు చేస్తే పోలీస్ అండ్ లా వ్యవస్థలు తమకు అండగా ఉంటాయా లేదా అన్న అభద్రతా భావం వారిని ఏళ్ల తరబడి మౌనంగా ఉంచుతుంది. బెదిరింపులు, భావోద్వేగ బ్లాక్మెయిల్ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరి సమ్మతి వల్లే అనేది మసకబారుతుంది. మొదట సమ్మతి ఉన్నా, తర్వాత బలవంతం లేదా హింస జరిగితే అది కచ్చితంగా నేరమే అవుతుంది. బాధ్యత ఎప్పుడూ బలవంతుడిపైనే ఉంటుంది.

బాధితురాలు నేరుగా పోలీసుల కంటే మీడియాను ఆశ్రయించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కనిపిస్తాయి. అధికార పార్టీలో ఉన్న నేత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) కాబట్టి అపోజిషన్ పార్టీ బాధితురాలిని నయానో, భయానో ఒప్పించి తమకు అనుకూలంగా మార్చుకోవడం కూడా ఉండొచ్చు. లేదంటే నిజంగానే మీడియాలో వార్త వస్తేనే పోలీసులు సీరియస్ గా తీసుకుంటారని, అప్పుడే తమకు ప్రాణరక్షణ ఉంటుందని బాధితురాలు నమ్మి ఉండొచ్చు.అధికారంలో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలంటే ప్రజాభిప్రాయం తోడవ్వాలని బాధితులు భావించడం కూడా కావొచ్చని సైకాలజిస్టులు అంటున్నారు.
ఒక నేతపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అది కేవలం వ్యక్తిగతం కాదు, అది పార్టీ ఇమేజ్ను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే నిందితులు తరచుగా బాధితురాలి క్యారెక్టర్‌ను కించపరచడం ద్వారా తప్పించుకోవాలని చూస్తారు. దీనినే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. దీనివల్ల ఇతర బాధితులు భవిష్యత్తులో బయటకు రాకుండా అడ్డుకోవడంలో ఇదే ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఏది ఏమయినా ఇలాంటి వార్తలను చూసినప్పుడు సొసైటీ తామే ఒక జడ్జిలాగా తీర్పులు ఇవ్వకూడదు. ఆరోపణలు నిజమా కాదా అనేది విచారణలో తేలుతుంది. అప్పటివరకు బాధితులు, నిందితులుగా చెప్పేవారిని కూడా దోషులుగా చూడకూడదు. నిజం బయటకు రావాలంటే భయం లేని వాతావరణం, న్యాయమైన విచారణ, బాధ్యతాయుతమైన మీడియా కూడా అవసరమే.
ఈ కేసులో జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం.. న్యాయం దిశగా ఒక మంచి అడుగుగా భావించొచ్చు. న్యాయం అనేది భావోద్వేగంతో కాదు, ఆధారాలతో , నిష్పక్షపాత విచారణతో రావాలని ఆశిద్దాం.
Erra Matti Dibbalu:విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు.. భూమి పుట్టినప్పటి ఆనవాళ్లు




One Comment