Cyclone: తీవ్ర తుపానుగా మారిన మొంథా.. తీరం దాటే సమయంలో 110 కి.మీ వేగంతో గాలులు
Cyclone :ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యం వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Cyclone
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాను(Cyclone)గా మారింది. ప్రస్తుతం ఈ తుపాను మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 280 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యం వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తీవ్ర తుపాను(Cyclone)గా మారిన మొంథా సైక్లోన్ ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.
తీరం దాటిన తర్వాత కూడా సుమారు 18 గంటల పాటు ఏపీలో తుపాను బీభత్సం కొనసాగనుంది.

ఏపీలో హై అలర్ట్ & బీభత్సం..మొంథా తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది.
ఏపీలోని 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.
విశాఖ జిల్లాలో తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా బీచ్ రోడ్డు పూర్తిగా వర్షం నీటిలో మునిగిపోయింది. దీంతో పోలీసులు వెంటనే వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
తుపాను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరియు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



