Assembly : అసెంబ్లీలో నో వర్క్ – నో పే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన అమలు సాధ్యమేనా?
Assembly : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అఖిల భారత స్పీకర్ల మహాసభలో ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు
Assembly
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అఖిల భారత స్పీకర్ల (Assembly) మహాసభలో ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చట్టసభలకు హాజరుకాకుండా , శాలరీలు మాత్రం తీసుకుంటున్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని, దీని కోసం నో వర్క్ – నో పే , రైట్ టు రీకాల్ వంటి కఠిన నిబంధనలను అమలు చేయాలని కోరారు.
ముఖ్యంగా 2024 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(Assembly ) కి కొంతమంది ఎమ్మెల్యేలు ..ఒక్క రోజు కూడా హాజరుకాకుండా..ప్రజల సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి రాజ్యాంగ సవరణ చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈ నిబంధనలు చట్టసభ సభ్యులకు ఎందుకు వర్తించవని ఆయన ప్రశ్నించారు
నిజమే.. స్పీకర్ ప్రశ్న నిజంగానే ఆలోచించదగ్గదే . అయితే భారతదేశంలో ఇలాంటి నిబంధనను అమలు చేయాలంటే రాజ్యాంగ పరమైన మార్పులు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 ప్రకారం.. ఎమ్మెల్యేల జీతభత్యాలు చట్టబద్ధంగా నిర్ణయించబడ్డాయి. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ (Assembly )సమావేశాలకు రాకపోయినా కూడా వారి వేతనాన్ని కట్ చేసే అధికారం ప్రస్తుతం స్పీకర్‌కు పూర్తిస్థాయిలో లేదు.
దీనిని మార్చడానికి పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీతో.. రాజ్యాంగ సవరణ జరగాలి. గతంలో వరుణ్ గాంధీ వంటి వారు ఇటువంటి ప్రతిపాదనలు చేసినా అవి తిరస్కరణకు గురయ్యాయి. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం మాత్రం 2015లో ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. అప్పట్లో అక్కడ సభలో గొడవలు చేయడం వల్ల.. సెషన్ ఆలస్యమైతే ఎమ్మెల్యేల వేతనాల్లో కోత విధించాలని స్పీకర్ సీతాశరణ్ శర్మ నిర్ణయించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ఎమ్మెల్యేల హాజరు శాతం 60 నుంచి 85 శాతానికి పెరగడమే కాకుండా, సభ పనిదినాలు కూడా గణనీయంగా పెరగడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను అమలు చేస్తే చాలా సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సభకు రాకుండా దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభకు హాజరవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజా సమస్యలపై చర్చలు అర్థవంతంగా సాగుతాయి. ఆర్థికంగా చూస్తే, సగటున ఒక ఎమ్మెల్యే నెలకు 2.3 లక్షల రూపాయల వేతనం, ఇతర భత్యాలు తీసుకుంటారు. వీరు సభకు హాజరు కాకపోవడం వల్ల ప్రజా ధనం వేస్ట్ అవుతోంది.
నో వర్క్ – నో పే కనుక అమలు చేస్తే నెలకు కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుంది. అంతేకాకుండా ‘రైట్ టు రీకాల్’ అంటే సరిగ్గా పని చేయని ఎమ్మెల్యేలను వెనక్కి పిలిపించే హక్కు ప్రజలకే ఇస్తే, రాజకీయ నాయకులలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో పంచాయతీ స్థాయిలో ఈ విధానం అమలులో ఉంది.
అయితే ఈ ప్రతిపాదనల అమలులో అనేక రాజకీయ , చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఇలాంటి నిబంధనలను ప్రవేశపెడితే అది విపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికే అని వైసీపీ నేతలు ఆరోపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉంటున్నారు.

వారిపై చర్యలు తీసుకుంటే అది రాజకీయ కక్షసాధింపు చర్యగా.. కోర్టుల్లో కూడా సవాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేల హాజరును ఎలా ట్రాక్ చేయాలి, అనారోగ్యం వంటి కారణాలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశాలపైనా స్పష్టత రావాలి. లేకపోతే ఇది కేవలం రాజకీయ యుద్ధాలకు వేదికగా మారుతుంది.
మొత్తంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ ప్రతిపాదన చట్టసభల గౌరవాన్ని పెంచడానికి ఉద్దేశించినదే అయినా కూడా, దీనికి రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం అవసరం. కేవలం వేతనాలు కట్ చేయడం మాత్రమే కాకుండా, ఎమ్మెల్యేలు సభకు వచ్చేలా ప్రోత్సహించే వాతావరణం ఉండాలి.
తొలి దశలో భత్యాల కోత వంటి చిన్నచిన్న మార్పులతో ప్రారంభించి, ఆ తర్వాత పూర్తిస్థాయి చట్ట సవరణల వైపు వెళ్లడం ఆచరణాత్మకంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సభకు జవాబుదారీగా ఉంటారు మరియు ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయని అంటున్నారు. మధ్యప్రదేశ్ మోడల్ తరహాలో ఏపీ కూడా ఒక ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుంటే, అది దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందనేది మాత్రం నిజం.




2 Comments