Glass Bridge: విశాఖకు కొత్త అందం వచ్చేసింది.. దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన ప్రత్యేకతలివే..!
Glass Bridge: మన దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కైలాసగిరి కొండపై ప్రారంభమైంది.
Glass Bridge
పర్యాటక ప్రియులకు ఇది నిజంగా ఒక గుడ్‌న్యూస్ ! మన దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన-Glass Bridge) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కైలాసగిరి కొండపై ప్రారంభమైంది. రూ. 7 కోట్ల వ్యయంతో వీఎంఆర్డీఏ , ఆర్జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో గాలిలో తేలియాడుతున్న అనుభూతినిచ్చే కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి(Glass Bridge)ని నిర్మించారు. ఈ వంతెన ప్రారంభంతో, విశాఖపట్నం పర్యాటక రంగంలో ఒక సరికొత్త ఆకర్షణ కేంద్రంగా మారింది.
ఇప్పటివరకు కేరళలో 40 మీటర్ల పొడవున్న గాజు వంతెన (Glass Bridge)రికార్డును కలిగి ఉండేది. అయితే, కైలాసగిరిపై నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి ఏకంగా 50 మీటర్ల పొడవుతో ఆ రికార్డును అధిగమించి, దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యేకంగా 40 మిల్లీమీటర్ల (mm) మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును ఉపయోగించారు. ఈ అత్యంత నాణ్యత గల గాజును జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు.
భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ. .దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ గాజు వంతెన ఒకేసారి ఏకంగా 500 టన్నుల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునేలా దీనిని నిర్మించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కుచెదరదు.

ఈ వంతెనపై ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యం ఉన్నా కూడా, పర్యాటకుల భద్రత దృష్ట్యా కేవలం 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. గ్లాస్ బ్రిడ్జిపై నడుస్తూ చుట్టూ చూస్తే, ఎత్తైన కొండలు, దిగువన లోయ, దూరంగా అద్భుతమైన సముద్ర తీరం కనిపిస్తాయి. ఈ దృశ్యం బ్రిడ్జిపై నడిచే వారికి గాలిలో తేలియాడుతున్నట్లు, ఒక కొత్త లోకంలో విహరిస్తున్న అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
మరో ఆకర్షణీయమైన అంశం ఏంటంటే, రాత్రి వేళల్లో ఈ గాజు వంతెన త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్తు కాంతులతో మెరిసిపోతుంది, ఇది నగరానికి వచ్చే టూరిస్టులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, త్వరలో కైలాసగిరిపై ‘త్రిశూల్ ప్రాజెక్టు’ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వీఎంఆర్డీఏ ప్రకటించింది.



