ODI : చిత్తుగా ఓడిన పాకిస్థాన్..బంగ్గా చేతిలో ఘోరపరాభవం
ODI : ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ జట్టు మరోసారి ఘోరపరాభవాన్ని చవిచూసింది.
ODI
ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ జట్టు మరోసారి ఘోరపరాభవాన్ని చవిచూసింది. టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8లోనే ఇంటిదారి పట్టిన పాక్ జట్టు ఈ టోర్నీ తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మూడు వన్డేల(ODI) సిరీస్ కోసం బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న పాకిస్థాన్ తొలి వన్డేలో(ODI) ఘోరపరాజయాన్ని చవిచూసింది.
బంగ్లా బౌలర్ నహీద్ రాణా(5/24) దెబ్బకు కేవలం 114 పరుగులకే కుప్పకూలాడు. ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలవలేకపోయారు. పాక్ బ్యాటింగ్ లో ఎనిమిదో నెంబర్ బ్యాటర్ ఫహీమ్ అష్రాఫ్ చేసిన 37 పరుగులే టాప్ స్కోర్ గా ఉంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ లో రెండు శతకాలు చేసిన ఓపెనర్ ఫర్హాన్ 27 రన్స్ తో పర్వాలేదనిపించగా.. మిగిలిన వారంతా చేతులెత్తేశారు.
బంగ్లా బౌలర్ నహీద్ రాణా బౌలింగ్ లో సింగిల్స్ తీసేందుకు కూడా పాక్ బ్యాటర్లు భయపడ్డారు. అతనితో పాటు మరో బౌలర్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 3 వికెట్లతో పాక్ ను దెబ్బకొట్టాడు. ఫహీమ్ అష్రాప్ పోరాడకుంటే పాక్ ఇన్నింగ్స్ 82 పరుగులకే ముగిసేది. హమిల్ హుసేన్ 4, సల్మాన్ అఘా 5, హుసేన్ తలాత్ 4, షాహీన్ అఫ్రిది 4 పరుగులకే ఔటయ్యారు.

ఈ సిరీస్కు బాబర్ ఆజమ్ ను పాక్ సెలక్టర్లు పక్కన పెట్టారు. తర్వాత లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ దుమ్మురేపింది. ఓపెనర్ సైఫ్ హసన్ 4 పరుగులకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ హసన్ తమీమ్ చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పాక్ బౌలర్ల పసలేని బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నాడు.
కెప్టెన్ షాహీన్ అఫ్రిదితో పాటు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అతనితో పాటు శాంటో (27) రాణించడంతో బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.





