Akhanda-2: బాలయ్య అభిమానులకు షాక్..అఖండ-2 విడుదలపై కోర్టు బ్రేక్
Akhanda-2: రేపు, డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కావాల్సిన అఖండ-2 , ఊహించని న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
Akhanda-2
నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ-2’ (Akhanda-2)విడుదలపై మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రేపు, డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఊహించని న్యాయపరమైన చిక్కుల్లో పడింది. కోర్టు స్టే విధించడంతో, బాలయ్య అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
విడుదలకు అడ్డంకిగా మారిన ఆర్థిక వివాదం..సినిమా విడుదలకు అడ్డంకిగా మారిన ప్రధాన కారణం సినిమా కంటెంట్‌కు సంబంధించినది కాదు, ఇద్దరు ప్రముఖ నిర్మాణ సంస్థల మధ్య ఉన్న పాత ఆర్థిక వివాదం. ఈ వివాదం ‘అఖండ-2’ (Akhanda-2)చిత్రాన్ని నిర్మించిన సంస్థకు సంబంధించినది కావడం గమనార్హం.
ఈ వివాదం ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థకు, ‘అఖండ-2’ నిర్మాణంలో పాలు పంచుకున్న ఒక భాగస్వామ్య సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీకి మధ్య కొనసాగుతోంది.

గతంలో వీరి మధ్య జరిగిన ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) కేసులో ఈరోస్ సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు ప్రకారం, 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈరోస్‌కు దాదాపు రూ. 28 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఆర్బిట్రేషన్ తీర్పు వచ్చినా, ఆ డబ్బు తమకు ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ బకాయిల పరిష్కారం కోసం, కోర్టు ‘అఖండ-2’ సినిమా విడుదలను ఆపాలని అభ్యర్థించింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ‘అఖండ-2’ మూవీ విడుదలపై నిషేధం విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయకూడదని,థియేటర్లలో ప్రదర్శించకూడదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓటీటీ (OTT), సాటిలైట్ (Satellite) హక్కుల అమ్మకాలు, పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) పూర్తిగా నిలిపివేయాలని చెప్పింది
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామంతో, బాలకృష్ణ అభిమానులతో పాటు, డిసెంబర్ 5వ తేదీ కోసం ఎదురుచూస్తున్న పంపిణీదారులు, ఎగ్జిబిటర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సినిమా విడుదల విషయంలో నిర్మాత సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది.



