Chiranjeevi: మెగాస్టార్ బర్త్‌డే ట్రీట్..ఈ రీ-రిలీజ్ స్పెషాలిటీ ఏంటంటే..
Chiranjeevi:సుమారు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రీ-రిలీజ్‌కు రెడీ అయింది.

Chiranjeevi
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. పాత సూపర్ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసే అవకాశం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన క్లాసిక్ ఫిల్మ్ స్టాలిన్(Stalin movie) చేరింది. సుమారు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం, చిరంజీవి పుట్టినరోజు(Chiranjeevi birthday) సందర్భంగా ఆగస్టు 22న రీ-రిలీజ్‌కు రెడీ అయింది. దీని గురించి స్వయంగా చిరంజీవి ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది.
‘స్టాలిన్’ సినిమాను కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేయలేమని చిరంజీవి(Chiranjeevi) అన్నారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని, ఎందుకంటే ఇది సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. కథ ప్రకారం, ఒక వీర జవాను దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాటం కన్నా, దేశం లోపల ఉన్న శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకుని, ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు.

“నేను బాగుంటే చాలు అనుకోకుండా, మనం చేసే మంచిపనికి కృతజ్ఞతగా మరొక ముగ్గురికి సహాయం చేసి, వాళ్ళు మరో ముగ్గురికి సహాయం చేసేలా ప్రోత్సహించాలి.. ఇలా ఈ మంచి పరంపర కొనసాగాలి” అనే ‘వన్ ఫర్ త్రీ’ కాన్సెప్ట్ ఈ సినిమాలో ముఖ్య సందేశం. ఈ ఆలోచన అప్పట్లో ఎంతోమంది ప్రేక్షకులను కదిలించింది.
‘గజినీ’ వంటి హిట్ చిత్రాల డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష నటించగా, కుష్బూ, ప్రకాశ్ రాజ్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ అందించిన పాటలు, మరీ ముఖ్యంగా ‘పరేషాన్ పరాశరం..’ వంటి పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తుంటాయి. ఈసారి ఈ సినిమాను మెరుగైన దృశ్య అనుభవం కోసం 8K వెర్షన్‌గా మార్చి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
Straight from the HEART of the BOSS ❤️🔥#Stalin Reporting in Theatres on 22nd August 🌟@KChiruTweets @trishtrashers @NagaBabuOffl pic.twitter.com/vDRxTa9YfC
— Anjana Productions (@Anjana_Prod) August 16, 2025
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప కానుకగా రానున్న ఈ సినిమా, కొత్తతరం ప్రేక్షకులకు కూడా ఒక మంచి సందేశాన్ని అందిస్తుందని, ఈ సమాజం పట్ల బాధ్యతను తెలియజేస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం నాగబాబు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రం అందరికీ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నానని చిరంజీవి చెప్పారు.