Vladimir Putin
జీవితంలో కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు, ఊహించని మలుపులు మన జీవితాలను ఒక కొత్త దిశగా మారుస్తాయి. అలాంటి ఒక విచిత్రమైన, ఆశ్చర్యకరమైన కథనాన్ని మాజీ అమెరికా ఫస్ట్ లేడీ, రాజకీయవేత్త హిల్లరీ క్లింటన్ తన పుస్తకం ..హార్డ్ ఛాయిసెస్(Hard Choices)లో వెల్లడించారు. ఇది కేవలం ఒక కథ కాదు, విధి ఎలా పని చేస్తుందో చెప్పే ఒక ఉదాహరణ.
ద్వితీయ ప్రపంచ యుద్ధం (World War II) జరుగుతున్న రోజులు. ఒక రష్యన్ సైనికుడు కొన్ని వారాల పోరాటం తర్వాత సెలవుపై తన గ్రామానికి బయలుదేరాడు. మనసులో ఎన్నో ఆశలు, తన కుటుంబాన్ని చూసుకోవాలనే ఆనందం. కానీ గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత అతని ఆశలన్నీ అడియాశలయ్యాయి.
శత్రువుల బాంబు దాడి వల్ల గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడ చూసినా శిథిలాలు, మృతదేహాలు. సైనిక వాహనాలలో వందలాది మృతదేహాలను సామూహిక సమాధికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దృశ్యం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. దుఃఖంలో ఉన్న ఆ సైనికుడు కొన్ని క్షణాలు ఆ మృతదేహాల ముందు నిలబడ్డాడు. అప్పుడు అతని కళ్లు ఒక మహిళ పాదాల వద్ద ఉన్న షూస్ పై పడ్డాయి. అవి అచ్చం తాను తన భార్యకు కొనిచ్చిన షూస్ లాగే అనిపించాయి.
గుండెల్లో ఒక రకమైన ఆందోళనతో, అతను వెంటనే ఇంటికి పరుగెత్తాడు. ఇల్లు పూర్తిగా శిథిలమై ఉంది, భార్య జాడ కనిపించలేదు. అతని అనుమానం నిజమైందేమోనని మనసు భయపడింది. తిరిగి వచ్చి ఆ మృతదేహాన్ని మరింత దగ్గరగా పరిశీలించాడు. ఆశ్చర్యం.. అది తన భార్యే!
అతను షాక్‌కు లోనయ్యాడు. నా భార్యను సామూహిక సమాధిలో పూడ్చలేను అనుకొని, ఆమె మృతదేహాన్ని ప్రత్యేకంగా పూడ్చడానికి అనుమతి కోరాడు. అధికారులు అతని దుఃఖాన్ని అర్థం చేసుకొని అనుమతి ఇచ్చారు. చాలా కష్టంగా ఆమెను వాహనం నుంచి కిందకు దించుతున్నప్పుడు అతనికి మరోసారి గుండెల్లో ఏదో తెలియని సంచలనం. ఆ చల్లని శరీరంలో ఏదో ఒక కదలిక కనిపించినట్లు అనిపించింది. మరోసారి పరిశీలిస్తే.. ఆశ్చర్యంగా ఆమె ఇంకా చనిపోలేదు, ప్రాణాలతోనే ఉందని గ్రహించాడు.
మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాణాల కోసం పోరాడుతున్న తన భార్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఎంతో ప్రయత్నించి ఆమెకు చికిత్స అందించారు. విధి ఆమెను బతికించాలని రాసి పెట్టిందేమో, ఆమె తిరిగి ప్రాణాలతో బయటపడింది.
కొన్ని సంవత్సరాల తరువాత, ఆ దంపతులకు ఒక బాబు జన్మించాడు. చనిపోవాల్సిన ఆ బాబు తల్లిని చివరి క్షణంలో రక్షించుకోగలిగాడు ఆ సైనికుడు. అతని చర్య వల్ల పునర్జన్మ పొందిన ఆ మహిళ జీవితంలోకి వచ్చిన ఆ బిడ్డకు “వ్లాదిమిర్” అని పేరు పెట్టారు. అవును! మీరు విన్నది నిజమే. ఆ పసికందు ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న శక్తులలో ఒకడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).
ఈ కథ వింటుంటే ఇది కేవలం ఒక అదృష్టమా లేక విధి రాసిన అద్భుతమైన నిజమా అని ఆలోచింపజేస్తుంది. ఒక చిన్న నిర్ణయం, ఒక జత షూస్.. ప్రపంచ చరిత్రను ఎలా మార్చగలవో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఒక సైనికుడి ప్రేమ, అతని భార్య బ్రతికి ఉండాలనే కోరిక.. ఇవన్నీ కలిసి రష్యా ప్రజలకు ఒక కొత్త నాయకుడిని అందించాయి.