Elon Musk: 500 బిలియన్ డాలర్ల మార్క్… చరిత్ర సృష్టించిన మస్క్
Elon Musk: తాజా లెక్కల ప్రకారం ఆయన నికర సంపద 351.5 బిలియన్ డాలర్లుగా( భారత కరెన్సీలో 29,17,450 కోట్లు )గా ఉంది.

Elon Musk
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) చరిత్ర సృష్టించారు. భూమ్మీద అత్యంత సంపద కలిగిన వ్యక్తుల్లో 500 బిలియన్ డాలర్లు.. అంటే హాఫ్ ట్రిలియన్ మార్క్ అందుకున్న తొలి కుబేరుడిగా నిలిచారు. ఫోర్భ్స్ లెక్కల ప్రకారం తాజాగా మస్క్ నికర సంపద విలువ 500 బిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.41 వేల కోట్లకు పైగా ) మార్క్ ను అందుకుంది. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అరుదైన మైలురాయి అందుకునేందుకు మస్క్ చేరువవుతున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా స్టాక్ ఒక్కసారిగా పుంజుకోవడంతో మస్క్(Elon Musk) సంపద భారీగా పెరిగింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎన్నికల సమయంలో అత్యంత సన్నిహితుడిగా ఉన్న మస్క్ ఇటీవలే ఆయనతో విభేదిస్తున్నాడు. అటు ట్రంప్ కూడా కొన్ని విమర్శలు చేయడంతో మస్క్ కు చెందిన కీలక సంస్థల షేర్లపై గట్టిగానే ప్రభావం పడింది.
షేర్ మార్కెట్ లో వాటి విలువ భారీగా పడిపోయింది. కానీ దీనికి ధీటుగా నిలబడ్డ మస్క్ ఇటీవల తన ప్రధాన కంపెనీ టెస్లాలో బిలియన్ డాలర్ల విలువైన మరికొన్ని షేర్లను కొనుగోలు చేశాడు. దీంతో ముదుపర్ల నమ్మకం మళ్ళీ పెరిగింది. ఈ క్రమంలోనే టెస్లా షేర్లు మళ్ళీ పెరిగాయి. అటు మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ , ఏఐ స్టార్టప్స్ వాల్యుయేషన్స్ కూడా భారీగానే పుంజుకున్నాయి. మస్క్ సంపదను చాలా రెట్లు పెంచిన టెస్లా మార్కెట్ విస్తరిస్తుండడం కూడా మస్క్ ఈ మైలురాయి చేరడానికి కారణమైంది.

ఎలక్ట్రిక్ కార్ల సంస్థ అయిన టెస్లాకు విదేశాల్లో సైతం భారీ డిమాండ్ నెలకొనడం, వాటి వాడకం, నాణ్యత పెరగడం కూడా షేర్ల విలువ పెరగడానికి దోహదపడింది. కాగా మస్క్ మిగిలిన కంపెనీలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో పాటు ట్రంప్ తో మళ్ళీ కలవబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఒరాకిల్ కో ఫౌండర్ ఎలిసన్ ఫోర్భ్స్ జాబితాలో రెండో బిలియనీర్ గా చోటు దక్కించుకున్నారు. తాజా లెక్కల ప్రకారం ఆయన నికర సంపద 351.5 బిలియన్ డాలర్లుగా( భారత కరెన్సీలో 29,17,450 కోట్లు )గా ఉంది. తర్వాతి స్థానాల్లో మార్క్ జుకెర్ బర్గ్ , జెఫ్ బెజోస్ , లారీ ఫేజ్ టాప్ 5లో నిలిచారు. చాలా కాలం గట్టిపోటీనిచ్చిన వారెన్ బఫెట్ ఈ జాబితాలో పదో స్థానం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ సంపద వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే మరో ఎనిమిదేళ్ళలో అంటే 2033కల్లా ట్రిలియనీర్ గా రికార్డు సృష్టిస్తారని అంచనా వేస్తున్నారు.