England: చరిత్ర తిరగబడింది..పాలించిన స్థాయి నుంచి యాచించే స్థాయికి దిగొచ్చిన ఇంగ్లాండ్..
England: ఒకప్పుడు మన సంపదను దోచుకున్న సామ్రాజ్యం, నేడు అదే భారత్ వద్ద వ్యాపారం కోసం సాగిలాపడటం, మారుతున్న ప్రపంచ శక్తి సమీకరణాలను సూచిస్తున్న నిశ్శబ్ద ప్రకటనగా నిలిచింది.

England
సుమారు 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన బ్రిటన్ (ఇంగ్లాండ్(England)) నేడు అదే భారత్ ముందు తల వంచింది. వాణిజ్యం, పెట్టుబడులు, అవకాశాల కోసం యాచించే స్థాయికి దిగొచ్చిన బ్రిటన్, తన ప్రధానితో సహా వ్యాపార దిగ్గజాలతో కూడిన అతిపెద్ద బెటాలియన్‌ను భారత్‌కు పంపింది. ఒకప్పుడు మన సంపదను దోచుకున్న సామ్రాజ్యం, నేడు అదే భారత్ వద్ద వ్యాపారం కోసం సాగిలాపడటం, మారుతున్న ప్రపంచ శక్తి సమీకరణాలను సూచిస్తున్న నిశ్శబ్ద ప్రకటనగా నిలిచింది.
బ్రిటన్(England) ప్రధాన మంత్రి కియర్ స్టార్మర్ తన పర్యటన కోసం దేశ రాజధాని ఢిల్లీని కాకుండా, భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని ఎంచుకోవడం వెనుక బలమైన సందేశం ఉంది. ఇది కేవలం రాజకీయ పర్యటన కాదని, వ్యాపార పర్యటన అని, ఆర్థిక సంబంధాలకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రపంచానికి చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్న భారత్‌తో సుస్థిరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ చూస్తోంది.
ఆసక్తికరంగా, ఈ పర్యటనపై భారత మీడియా కంటే బ్రిటన్ మీడియా ఎక్కువ ఉత్సాహంగా ఉంది. GB న్యూస్ వంటి పత్రికలు ఈ పర్యటనను ఒక విజయ యాత్రగా అభివర్ణిస్తున్నాయి. ముంబైలో పోస్టర్లు, బ్యానర్లు, లైట్లతో మెరిసిపోతున్న దృశ్యం, బ్రిటిష్ ప్రజలకు కూడా చరిత్ర పూర్తిగా తలక్రిందులైపోయిందని స్పష్టం చేసింది.
బ్రిటన్(England)కి ఈ పర్యటన రాజకీయ ప్రాణాధారంగా మారింది. దీనికి ప్రధాన కారణం 2020లో జరిగిన బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడం). ‘Take Back Control’ నినాదంతో బయటకు వచ్చిన బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వెలుపల స్వతంత్రంగా ఎదగగలదని నిరూపించుకోవాల్సిన సవాలు ఎదుర్కొంటోంది.

గత ఐదేళ్లలో నలుగురు ప్రధాన మంత్రులు (బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్, కియర్ స్టార్మర్) మారినా, భారత్‌తో ఆశించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ఇంకా పూర్తి కాలేదు. ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న బ్రిటిష్ పరిశ్రమలు ఇప్పుడు యువశక్తితో, విస్తరిస్తున్న భారత మార్కెట్‌ను తమ భవిష్యత్తుగా చూస్తున్నాయి. అందుకే స్టార్మర్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విమాన కాక్‌పిట్ నుంచే ప్రసంగిస్తూ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలు “యుకే ఇప్పటివరకు భారత్ దేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య బృందం ఇదే” అనే మాటల్లో బ్రిటన్ ఆరాటం స్పష్టంగా తెలుస్తోంది.
- అక్టోబర్ 8న ముంబైలో ఇరు దేశాలు చర్చలు జరిపి, ఒప్పందాన్ని వేగవంతంగా, సమన్వయంతో, ఫలితాల ఆధారంగా అమలు చేయడంపై నియమాలను పునరుద్ఘాటించాయి.
- లక్ష్యం..ప్రస్తుతం $56 బిలియన్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $112 బిలియన్లకు పెంచడం.
- సుంకాల రద్దు.. సుమారు 14 రౌండ్‌ల చర్చల తర్వాత, భారతదేశం నుంచి యూకేకు ఎగుమతి అయ్యే 99% వస్తువులపై సుంకాల రద్దుకు బ్రిటన్ అంగీకరించింది.
- భారత్ సౌలభ్యం.. భారత్ యూకే వస్తువులపై సుమారు 3% తక్కువ సుంకం విధిస్తుంది, దీనిని ఐదేళ్లలో క్రమంగా తగ్గిస్తారు.
ప్రాధాన్య రంగాలు.. అధునాతన తయారీ, వినియోగ వస్తువులు, ఆహారం, సాంకేతిక ఆవిష్కరణ, శుభ్రమైన శక్తి, ఆర్థిక, విద్య, ఇంజినీరింగ్ వంటి కీలక రంగాలపై సమావేశాలు నిర్వహించబడ్డాయి.
ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాల పేరుతో వచ్చి భారత్‌ను దొచుకున్న చరిత్ర తిరిగి పునరావృతం కాకుండా భారత్ ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దేశీయ పరిశ్రమలకు హాని కలగకుండా ఉండేలా, ఎగుమతుల ఆధారిత వృద్ధిపై దృష్టి సారించి ఈ చర్చలను ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం రూపాయల పరంగా సుమారు రూ.4.34 లక్షల కోట్లు ఉండగా, అందులో భారత్‌కే సుమారు రూ.1 లక్ష కోట్లు అధికంగా ఉన్నాయి. ఇది మన దేశం ఎంతటి శక్తిమంతంగా ఉందో తెలియజేస్తుంది.
మొత్తంగా, ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు. ప్రపంచ పటంలో శక్తి సమీకరణాలు మారాయని, వ్యాపారం ఎలా చేయాలో ఈసారి భారతదేశం నిర్ణయిస్తుందనే నిశ్శబ్ద ప్రకటన ఇది.