Gaza: నీళ్ళు కావాలన్నా కోరిక తీర్చాల్సిందే గాజాలో దారుణ పరిస్థితులు
Gaza: యుధ్ధాలు జరుగుతున్నప్పుడు మహిళలపై ఇలాంటి లైంగిక దాడులు జరగడం కామనే అంటూ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్న యునిసెఫ్ ప్రతినిధులు చెబుతున్నారు.

Gaza
హమాస్ ,ఇజ్రాయిల్ మధ్య యుధ్ధం రెండేళ్ళుగా కొనసాగుతూనే ఉంది.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా… లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ భీకర దాడులతో గాజా(Gaza) అల్లాడుతోంది. అన్నింటికీ మించి గాజా ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. యుద్ధం కారణంగా కనీసం ఉండేందుకు చోటు లేకపోగా.. తినడానికి తిండి, తాగేందుకు నీళ్ళు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా ఇప్పుడు మరింత దారుణంగా అక్కడి పరిస్థితులు తయారయ్యాయి.
ఈ దుర్భర పరిస్థుతల మధ్య చావలేక , తమ పిల్లల కోసం రోజులు గడుపుతున్న మహిళల దయనీయ స్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా అంతర్జాతీయ మీడియాలో గాజా(Gaza) మహిళలకు సంబంధించి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వచ్చిన కథనాలు చూస్తే జాలి కలగక మానదు. గాజాలో మహిళలకు సాయం చేస్తున్నామనే పేరుతో వారిని లైంగిక దోపిడీ చేస్తున్నారు. వారి ఆకలి కేకలను అలుసుగా తీసుకుంటున్న వాలంటీర్లు ఆహారం, ఉపాధి పేరుతో బలవంతంగా లొంగదీసుకుంటున్నారు.

తమ పిల్లల కడుపు నింపాలనే కారణంగా మహిళలు చేసేదేమీ లేక వారితో వెళుతున్నారు. పని కల్పిస్తామని, ఆహారం ఇస్తామనే కాదు చివరికి నీళ్ళు కావాలన్నా కూడా వారి కోరిక తీర్చాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నామని అక్కడ నుంచి బయటపడిన కొందరు మహిళలు చెబుతున్నారు.
గత కొంతకాలంగా పలు స్వఛ్ఛంద సంస్థలు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నా… అందరికీ సరిపోవడం లేదు. దీంతో ఆహారం, మంచినీళ్ళు దొరక్క అక్కడి మహిళలు, చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. మానవతా సాయం పేరుతో తమను బలవంతంగా అనుభవిస్తున్నా ఏం చేయలేక, అక్కడ నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూశామంటూ బాధిత మహిళలు కళ్ళకు కట్టినట్టు తాము పడ్డ కష్టాలను వివరిస్తున్నారు.

ఉపాధి పేరిట కొందరు లొంగదీసుకుని నరకం చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు పెళ్ళి చేసుకుంటామంటూ మభ్యపెట్టి లైంగికదాడులకు తెగబడుతున్నారని కన్నీళ్ళు పెట్టుకున్నారు. యుధ్ధాలు జరుగుతున్నప్పుడు మహిళలపై ఇలాంటి లైంగిక దాడులు జరగడం కామనే అంటూ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్న యునిసెఫ్ ప్రతినిధులు చెబుతున్నారు.
గాజా(Gaza)లో ఇలాంటి సంఘటనలు తాము చాలానే చూశామంటున్నారు. కానీ లైంగిక దాడులు జరిగాయనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవన్న కారణంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలతో వందలాది మంది గర్భం దాల్చినట్టు కూడా తెలుసని వారు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురిస్తున్నా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.