Guinness Book: గిన్నిస్ బుక్.. ప్రపంచ రికార్డుల చరిత్ర ఎలా పుట్టింది?
Guinness Book:గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరుతో తొలిసారిగా 1954లో కేవలం 1000 కాపీలను ప్రచురించారు. ఈ కాపీలలో వివిధ దేశాలకు చెందిన రికార్డులు, మరియు అరుదైన విషయాలను పొందుపరిచారు.
Guinness Book
ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, లేదా ప్రపంచంలో అనేక అరుదైన , అద్భుతమైన విషయాలు దాగి ఉంటాయి. అలాంటి ప్రతిభను గుర్తించి, వాటిని ఒకే చోట పొందుపరచి, ప్రపంచానికి పరిచయం చేసేదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of World Records). ఈ పుస్తకం కోట్ల మందిలో స్ఫూర్తిని నింపుతోంది. మరి అలాంటి అద్భుతమైన బుక్ ఎలా పుట్టింది?
ఈ (Guinness Book)పుస్తకం ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సర్ హ్యూ బీవర్ అనే ఒక వ్యాపారవేత్త 1950వ దశకంలో ఐర్లాండ్‌లో ప్రసిద్ధి చెందిన ఆర్డర్ గిన్నిస్ అనే ఒక మద్యం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారు. 1951లో, ఒక రోజు ఆయన తన స్నేహితులతో కలిసి వేటకు వెళ్లారు. ఆ సమయంలో వారికి ఒక ప్రశ్న వచ్చింది.. “యూరోప్ ఖండంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది?” దీనికి సరైన సమాధానం ఎవరికీ తెలియలేదు. బీవర్ అనేక మందిని అడిగినా, నిర్దిష్టమైన సమాచారం దొరకలేదు.

ఆ సమయంలోనే ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇలాంటి అరుదైన విషయాలు, సరిహద్దు లేని రికార్డులు, మరియు అతిగొప్ప విజయాలపై ఒక ప్రామాణికమైన, మరియు సులభంగా అందుబాటులో ఉండే పుస్తకం ఉంటే ఎంత బాగుంటుందనే ఆలోచనతోనే 1954లో, ఆయన గిన్నిస్ పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి శ్రీకారం చుట్టారు. గిన్నిస్ అనేది హ్యూ బీవర్ MDగా ఉన్న కంపెనీ పేరు కావడంతో, అదే పేరును ఖరారు చేశారు.
గిన్నిస్ బుక్(Guinness Book) ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరుతో తొలిసారిగా 1954లో కేవలం 1000 కాపీలను ప్రచురించారు. ఈ కాపీలలో వివిధ దేశాలకు చెందిన రికార్డులు, మరియు అరుదైన విషయాలను పొందుపరిచారు. ఈ పుస్తకం ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఆదరణ పొందింది. దీంతో 1955 నుంచి దీనిని అధికారికంగా పూర్తి బైండింగ్ పుస్తకంగా విడుదల చేయడం మొదలుపెట్టారు. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.
ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే పుస్తకంలో దాదాపు 1000 ఫోటోలు , 4 వేల రికార్డులను నమోదు చేస్తున్నారు. ఏటా ప్రపంచంలోని 118 దేశాల నుంచి 35 వేలకు పైగా రికార్డుల అప్లికేషన్లు ఈ కార్యాలయానికి వస్తుంటాయి. ఈ పుస్తకం ప్రతి సంవత్సరం అత్యధికంగా కాపీ రైట్ ఉన్న పుస్తకాలలో ఒకటిగా విక్రయించబడుతోంది. ప్రతి సంవత్సరం 13 కోట్ల పుస్తకాలను ముద్రించి, 100 దేశాల్లో 25 భాషల్లో విక్రయిస్తున్నారు. దాదాపు 63 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పుస్తకంలో ఇప్పటివరకు 53 వేలకు పైగా రికార్డులను నమోదు చేశారు.



