Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా దాడులు.. అక్కడ భారతీయుల పరిస్థితి ఏంటి?
Bangladesh: తాజాగా చిట్టగాంగ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
Bangladesh
బంగ్లాదేశ్(Bangladesh)లో కొన్ని నెలలుగా హిందూ మైనారిటీలపై దాడులు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా చిట్టగాంగ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్ విడుదల చేసిన వీడియోలు చూస్తుంటే అక్కడి హిందువులు ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతోంది.
మంగళవారం జరిగిన ఈ దాడిలో జయంతి సంఘ , బాబు శుకుశీల్ అనే వ్యక్తుల ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో వారు ప్రాణ భయంతో కంచెలను చీల్చుకుని బయటకు వచ్చి బతికారు. కానీ వారి మూగజీవాలు ఆ మంటల్లోనే కాలిపోయాయి. కేవలం ఆస్తులు తగులబెట్టడమే కాకుండా, పసిపిల్లలను కూడా కనికరించని పరిస్థితి అక్కడ ఉంది.
డిసెంబర్ 19న లక్ష్మీపూర్ సదర్‌లో ఒక ఇంటికి బయటి నుంచి తాళం వేసి పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల ఏడేళ్ల పసిపాప సజీవ దహనమైంది. అలాగే దీపు చంద్ర అనే యువకుడిని పని విషయంలో వచ్చిన వివాదంతో మతపరమైన రంగు పులిమి దారుణంగా చంపి చెట్టుకు వేలాడదీశారు.
ఈ దాడులు ఒక్కసారిగా ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్(Bangladesh)లో ఏర్పడిన రాజకీయ శూన్యత. గతంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, అక్కడ మత ఛాందసవాద శక్తులు ఒక్కసారిగా విజృంభించాయి.
ముఖ్యంగా జమాతే ఇస్లామీ వంటి సంస్థలు , కొన్ని తీవ్రవాద సమూహాలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రేరేపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ వదంతులు వ్యాప్తి చేసి జనాన్ని రెచ్చగొడుతున్నారు. మతపరమైన అంశాలను అడ్డుపెట్టుకుని హిందువుల భూములను ఆక్రమించుకోవడం, వారిని దేశం విడిచి వెళ్లేలా భయపెట్టడం వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

పోలీసులు కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నా, నిందితులను అరెస్టు చేయడంలో చూపిస్తున్న జాప్యం ఈ శక్తులకు మరింత బలాన్నిస్తోంది.
ఇక అక్కడ ఉంటున్న భారతీయుల భద్రత విషయం చూస్తే, భారత్ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు , ఉద్యోగ రీత్యా అక్కడ ఉంటున్న వారు ఇప్పుడు భయంతో కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా మెడికల్ చదివే భారతీయ విద్యార్థులు ఎక్కువగా చిట్టగాంగ్, ఢాకా ప్రాంతాల్లో ఉంటారు.
ప్రస్తుత గొడవలు హిందువులపైనే జరుగుతున్నా కూడా.. అక్కడ ఏర్పడిన అస్థిరత వల్ల భారతీయులెవరూ సేఫ్ గా ఉండలేకపోతున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో మాట్లాడి మన వారి భద్రతను పర్యవేక్షిస్తోంది. అయినా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. చాలా మంది భారతీయులు ఇప్పటికే బార్డర్ దాటి తమ స్వదేశానికి వచ్చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కలుగజేసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు మతపరమైన గొడవలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. హిందువుల దేవాలయాల పై దాడులు, ఊరేగింపుల పై రాళ్ల దాడులు వంటివి నిత్యకృత్యం అయ్యాయి.
ఇది కేవలం ఒక వర్గం సమస్య మాత్రమే కాదు, మానవత్వానికే పెద్ద ముప్పుగా పరిణమించింది. భారత్ ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. సరిహద్దుల్లో నిఘాను పెంచి, వలసలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అక్కడ మైనారిటీల ఉనికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. ఈ దారుణమైన దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది.



