Just LiteratureLatest News

Literature: పసి యాచకుడు

Literature: నీలాంటి తల్లులందరని యాచిస్తున్నా నాకులాగే మరో పుట్టుక వద్దు తల్లీ..!

Literature

చిరుగులున్న చీరచెంగును
చిట్టి ఊయలగా నాకు కట్టి
మరో చివర నీ మెడకు చుట్టి
ఒక్క చేతితో నన్ను అదుముకుంటూ
మరో చేతితో వేడుకుంటూ
రోడ్డున పడి నువు తిరుగుతుంటే
సాయమయినో లేదో గానీ
గాయమయినే నాది మనసు..!

మాటరాని నా మూగనోరు
ఆకలయినా నిను అడగలేదు
మనసు మాత్రం అడగమంది
పదే పదే ఒక్క ప్రశ్న..
నన్నెందుకమ్మా కన్నావు?
నన్నెందుకమ్మా కన్నావు?

అద్దాల మేడ లేకపోయినా
అమ్మ ఒడి చాలు నాకు..
పాపమంటూ
పసివాడనంటూ
పాలు నాకు పడతావంటే
పైసలేటకు పరాయమ్మతో
పంపుతుంటావు..
పురటాలినంటూ
అడుక్కుంటావు..

కడుపు నింపుకోవడం రాని దానివి
కడుపునెందుకు
పండించుకున్నావు?
నీతో పడక పంచుకున్న పోటుగాడికి
మన పోషణేమో గురుతులేదా?

ఎండ మండినా
చినుకు కురిసినా
నీకు భిక్ష దక్కితే నాకు రక్ష..
నగరమంతా నాలాంటి
చిట్టి పాపలు ఎందరెందరో..!
‘అయ్యో! పాపం’అంటూ కొందరు
‘ఏ పాపం ఫలితమో’ అంటూ కొందరు
జాలి చూపులు విసురుతుందురు
మనసు కరిగితే పైసలేస్తరు..
నువ్వు ఎవ్వరో..? నేను ఎవ్వరో?
ఒక్క ప్రశ్ననైనా అడగరెవ్వరు..

నీవు నేర్పిన భాషలోనే
నీలాంటి తల్లులందరని
యాచిస్తున్నా
నాకులాగే మరో పుట్టుక వద్దు తల్లీ..!

…ఫణి మండల

మరిన్ని లిటరేచర్ సమాహారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Related Articles

9 Comments

  1. చా లా బాధాకరం నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు superga vundhi👌

  2. ప్రాసలు, పదప్రయోగాలు,హృదయానికి తాకాయి.ఎవరిపాపం ఎవరిని పీడిస్తుంది అర్థంకాని స్థితిని చక్కగా విశ్లేషించి కళ్లముందుంచారు. గొప్ప భావానికి చక్కని కవిత అల్లారు. చిట్టి యాచకుల జీవితం కళ్ళముందు కదలాడింది.

  3. చాలా బాగుంది, బాధగా ఉంది. గుండెల్లో గుబులు రేపింది

  4. ఎక్సలెంట్ సార్ .👌👌👌వాస్తవికతను జోడించి రాసారు

  5. పసిమనసు హృద్యంగా ఆ తల్లిని అడిగిన మాటలు విన్నాకైనా అలాంటి తల్లులు, ఇలాంటి పరిస్థితికి కారణమైన తండ్రులు ఇలాంటి అసమానతలు కారణమైన ఈ సమాజానికి బుద్ది రావాలి…
    ఫణి మాష్టారు మీ కవి హృదయం,మీ మనసు ఇలాగే స్వచ్చంగా ఉండాలి.. మరిన్ని సామాజిక రుగ్మతలను మీ కలం స్పృశించాలి..
    Keep it up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button