Influenza
లాక్ డౌన్… కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పుడు ప్రపంచమంతా ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్… రోజుల తరబడి దేశ సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దులు మూసేసి ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయిన దారుణమైన పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికే వణుకే.. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా..అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఎందుకంటే కోవిడ్ తరహాలోనే కొత్త మహమ్మారి ఒకటి పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఇన్‌ఫ్లుఎంజా(Influenza) (ఫ్లూ) కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జపాన్, మలేషియా దేశాల్లో ఈ కొత్త వైరస్ భారీగా వ్యాపిస్తోంది. ముందు జపాన్ లో పెద్ద ఎత్తున కేసులు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. అయినా కూడా కేసుల తీవ్రత పెరుగుతూ పోయింది. ప్రస్తుతం జపాన్‌లోని హాస్పిటల్స్ అన్నీ ఈ ప్లూ బాధితులతో ఫుల్ అయిపోయాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలు, మార్కెట్లు, మాల్స్ మూసేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ లో ప్రస్తుతం కోవిడ్-19 తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఫ్లూ వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగితే మాత్రం లాక్ డౌన్ విధించాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తోంది.
కేవలం జపాన్ మాత్రమే కాదు మలేషియాలోనూ ఇన్‌ఫ్లుఎంజా(Influenza) కేసులు బయటపడ్డాయి. కొన్ని కేసులు వెలుగుచూసిన వెంటనే పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టిన మలేషియా ప్రభుత్వం పలు చోట్ల స్కూల్స్ ను మూసివేసింది. ఫ్లూ బారిన పడిన విద్యార్థులు వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని ఆదేశించింది. అటు విద్యామంత్రిత్వ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పాఠశాలల్లో ఫ్లూ తరహా లక్షణాలు కనిపించిన వారిని ప్రత్యేక క్వారంటైన్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇన్‌ఫ్లుఎంజా(Influenza) బారిన పడిన వారు కనీసం 5 నుంచి 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని అక్కడి వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
లేకుంటే కరోనా తరహాలోనే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. కోవిడ్-19 తర్వాత మలేషియా ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన మహమ్మారి ఇదేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎయిర్ పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్‌ఫ్లుఎంజా టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు.అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.