Sanae Takaichi: జపాన్ కు తొలి మహిళా ప్రధాని.. ఎవరీ తకైచీ ?
Sanae Takaichi: కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయని వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రాజీనామా చేసిన మాజీ ప్రధాని షిగేరు ఇషిబా స్థానంలో తకైచి ప్రధానిగా ఎన్నికయ్యారు.

Sanae Takaichi
జపాన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ ప్రధాని పీఠాన్ని తొలిసారి ఒక మహిళ అధిరోహించబోతున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనే తకైచి(Sanae Takaichi) జపాన్ 104వ ప్రధానిమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జపాన్ దేశంలో ఒక మహిళ ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టనుండడం ఇదే తొలిసారి. చాలా ఏళ్ళుగా అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ పలు కీలక పదవులు నిర్వర్తించిన తకైచీని ఐరన్ లేడీగానూ, లేడీ ట్రంప్ గానూ పిలుస్తారు.
దీనికి కారణంగ ఆమె దూకుడైనా స్వభావమే.. పైగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయని వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రాజీనామా చేసిన మాజీ ప్రధాని షిగేరు ఇషిబా స్థానంలో తకైచి ప్రధానిగా ఎన్నికయ్యారు. జపాన్ లో కొత్త ప్రధాని ఎన్నిక కోసం 465 స్థానాల్లో కనీసం 233 ఓట్లు సాధించాల్సి ఉండగా.. తకైచికి 237 ఓట్లు వచ్చాయి.

జపాన్ చక్రవర్తితో సమావేశం తర్వాత తకైచి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇదిలా ఉంటే జపాన్ కు తొలిసారి మహిళా ప్రధాని రానుండడంతో అందరూ ఆమె ఎవరా అని తెగ శోధిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న తకైచికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె జపాన్‌లోని నారా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. తల్లి పోలీస్ విభాగంలో పనిచేసేవారు.
చిన్ననాటి నుంచే స్వతంత్రతా భావాలతో కనిపించినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆమె ఒక బ్యాండ్ లో డ్రమ్మర్‌గానూ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారని గుర్తు చేసుకుంటున్నారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి ఆమె అర్హత సాధించినా ఇంట్లో ఫీజు కట్టేందుకు నిరాకరించడంతో ఇంటి దగ్గర నుంచే చదివారు.

1987లో తకైచి(Sanae Takaichi) అమెరికాకు వెళ్ళి డెమొక్రాటిక్ పార్టీకి ఫెలోగా పనిచేశారు. అక్కడి రాజకీయ వ్యవస్థతోనే ఆమె ఆలోచనలు పాలిటిక్స్ వైపు మొగ్గుచూపాయి. 1993లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె 1996లో అధికార పార్టీ ఎల్డీపీలో చేరారు. మాజీ ప్రధాని షింజో అబేకి ఆమె ప్రియమైన శిష్యురాలిగా ఉన్నారు. దీంతో పలు కీలకపదవులనూ చేపట్టి మంచి అనుభవం తెచ్చుకున్నారు.
అయితే 2021, 2024 పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనా పుంజుకుని 2025లో విజయం సాధించారు. ప్రస్తుతం తకైచి ముందు చాలా సవాళ్ళున్నాయి. ఎల్డీపీలో ఏర్పడిన అంతర్గత విభేదాలను పరిష్కరించడం ప్రధాన సవాల్ గా చెప్పాలి. అలాగే దేశ ఆర్థిక, విదేశాంగ విధానాల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించాల్సి రానుండడం మరో సవాల్ గా భావిస్తున్నారు. మొత్తం మీద తొలిసారి జపాన్ చరిత్రలో మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న తకైచికి చాలా సవాళ్ళే ఎదురుచూస్తున్నాయి.