No Entry for men: ఆడవాళ్లకు మాత్రమే ఈ ప్రదేశాలు: మగవాళ్లకు ‘నో ఎంట్రీ’ బోర్డు ఎందుకంటే?
No Entry for men: ఆడవాళ్లకు మాత్రమే అన్న బోర్డు ఒక ఊరికి ఉండడం ఆసక్తికరమైన విషయమే. ఈ వింత నియమాలు వెనుక మహిళల భద్రత, స్వాతంత్ర్యం మరియు సామాజిక కారణాలు ఉన్నాయి.
No Entry for men
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు, ఊళ్లు లేదా ద్వీపాలు కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. అక్కడ పురుషులకు(No Entry) అస్సలు ప్రవేశం ఉండదు. ఆడవాళ్లకు మాత్రమే అన్న బోర్డు ఒక ఊరికి ఉండడం ఆసక్తికరమైన విషయమే. ఈ వింత నియమాలు వెనుక మహిళల భద్రత, స్వాతంత్ర్యం , సామాజిక కారణాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన ‘ఓన్లీ ఫర్ ఉమెన్’ ప్రదేశాలు , వాటి వెనుక ఉన్న కథలు ఇక్కడ ఉన్నాయి.
1. సూపర్ షీ ఐల్యాండ్ (SuperShe Island) – ఫిన్లాండ్.. ఈ విలాసవంతమైన ద్వీపాన్ని క్రిస్టినా రోత్ అనే విజయవంతమైన బిజినెస్ ఉమెన్ స్థాపించారు. ఆమె కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తున్నప్పుడు పురుష బాస్ల ఆధిపత్యం , వేధింపులను ఎదుర్కొన్నారట. పురుషులు లేకుండా, మహిళలు కేవలం తమ ఆరోగ్యం, శ్రేయస్సు (Wellness)పై దృష్టి పెట్టడానికి ఒక సురక్షితమైన స్థలం ఉండాలనే ఆలోచనతో, ఆమె తన సొంత డబ్బుతో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసి ‘సూపర్ షీ ఐల్యాండ్’గా మార్చారు.

ఈ ప్రశాంతమైన ప్రదేశంలో మగవారికి ప్రవేశం(No Entry) లేదు. ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే యోగ, మెడిటేషన్, ఆరోగ్య శిక్షణ వంటి రిఫ్రెష్మెంట్ తరగతులను నిర్వహిస్తారు. అయితే, ఈ ప్రత్యేకమైన ప్రపంచంలో అడుగు పెట్టాలంటే నాలుగు వేల యూరోల (దాదాపు రూ.3.5 లక్షలు) ఫీజు చెల్లించడంతో పాటు, కఠినమైన ఎంపిక ప్రక్రియ (సెలెక్షన్స్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
2. అల్ సమాహా (Al Samaha) – ఈజిప్ట్.. అల్ సమాహా అనే గ్రామాన్ని ఈజిప్టు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సామాజిక లక్ష్యంతో నిర్మించింది. ఇక్కడ కేవలం వితంతువులు , విడాకులు తీసుకున్న మహిళలు మాత్రమే నివసిస్తారు. జీవితంలో ఎటువంటి ఆసరా లేని, దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలకు ఇక్కడ ఒక గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే ఈ గ్రామ లక్ష్యం.
ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థల సహాయంతో, అర్హులైన మహిళలకు ఈ ఊర్లో ఒక ఇల్లు, ఆరు ఎకరాల భూమి, మరియు జీవనోపాధి కోసం కావాల్సిన సరుకులను కూడా ప్రభుత్వమే అందిస్తుంది. మహిళలు ఈ భూమిని సాగుచేస్తూ, వ్యవసాయం చేస్తూ స్వాతంత్ర్యంగా జీవిస్తారు. అయితే, ఈ గ్రామంలో ఒక కఠినమైన నియమం ఉంది: ఇక్కడ నివసించే మహిళలు ఎవరైనా మళ్లీ పెళ్లి చేసుకుంటే, వారికి కేటాయించిన ఇల్లు , భూమిని తిరిగి ప్రభుత్వమే తీసుకుంటుంది.

3. ఉమోజ (Umoja) – కెన్యా.. ఉత్తర కెన్యాలో ఉన్న ఉమోజ గ్రామం, స్థానిక మహిళల పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఇక్కడ పురుషులకు పూర్తిగా నిషేధం(No Entry). స్థానికుల కథనం ప్రకారం, గతంలో బ్రిటిషర్ల చేతిలో అత్యాచారానికి గురైన మహిళలు కలిసి ఈ గ్రామాన్ని నిర్మించారు. అత్యాచార బాధితులు, అనాథలైన అమ్మాయిలు, ఏ దిక్కు లేని వృద్ధ మహిళలకు ఈ ఊరు నీడనిస్తోంది. ఈ మహిళలు తమ హక్కులు, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఒకరికొకరు తోడుగా జీవిస్తారు. ప్రస్తుతం 50 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఇక్కడ నివసిస్తున్నారు. వీరు పశువుల పెంపకం, వ్యవసాయం , రంగురాళ్లతో ఆభరణాల తయారీ వంటివి చేస్తూ తమ జీవనాన్ని తామే పోషించుకుంటున్నారు.
4. జిన్ వార్ (Jinwar) – సిరియా.. ఎప్పుడూ యుద్ధవాతావరణంతో అట్టుడుకుతున్న సిరియాలో, జిన్ వార్ అనే ఈ గ్రామం ఒక శాంతి నిలయం. ఇక్కడ మహిళా సంఘాలు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భార్యలు , యుద్ధ బాధితులైన మహిళల కోసం ఈ గ్రామాన్ని నిర్మించాయి. ఇక్కడ మహిళలు యుద్ధ భయాలకు దూరంగా, ఉమోజ గ్రామం స్ఫూర్తితో సాధారణ జీవితం గడుపుతున్నారు.
ఇక్కడి మహిళలు వ్యవసాయం, పశువుల పెంపకం వంటి పనులు చేస్తూ తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. తమ భద్రతను తామే చూసుకునేందుకు, గ్రామ సరిహద్దుల్లో మహిళలే తుపాకీలతో కాపలా కాస్తుంటారు. ఈ గ్రామం, కల్లోలిత ప్రాంతంలోనూ మహిళలు సంఘటితమైతే ఎంత సురక్షితంగా జీవించవచ్చో నిరూపిస్తోంది.



