Venezuela
వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టయినప్పటి నుంచీ అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు మదురోపై కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూనే మరోవైపు వెనిజులాలోని చమురుపై కన్నేసింది. పనిలో పనిగా దానిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన భారీ చమురు నౌకను స్వాధీనం చేసుకుని మరో షాక్ ఇచ్చింది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రెండు వారాల పాటు సుదీర్ఘంగా వెంబడించిన అమెరికా సైన్యం, ఎట్టకేలకు నౌకను తన అధీనంలోకి తీసుకుంది.
దీంతో ప్రపంచ దేశాలకు అసలు సంగతి పూర్తిగా అర్థమైపోయింది. వెనిజులాలో ఉన్న చమురు కోసమే ట్రంప్ ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. తాజాగా వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ట్రంప్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ దేశంలో ఉన్న చమురును దోచుకునేందుకే ట్రంప్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
అమెరికా తమ దేశంపై చేస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణా, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణల్లో నిజం లేదన్నారు. తమ దేశంలో భారీగా ఉన్న చమురు వనరుల కోసమే అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆమె ఆరోపించారు.తమ దేశ వనరులను సొంతం చేసుకోవడానికి అమెరికా చేస్తున్న ఆరోపణలన్నీ సాకు మాత్రమే అన్నారు.
ఈ సందర్భంగా అమెరికాతో ఇంధన సంబంధాలపైనా ఆమె స్పందించారు.అందరికీ ప్రయోజనం కలిగేలా వాణిజ్య ఒప్పందాల ఆధారంగా సహకరించుకోవడానికి వెనుజులా సిద్ధంగా ఉందని డెల్సీ రోడ్రిగ్జ్ స్పష్టం చేశారు. అదే సమయంలో అమెరికాతో తమకు తీవ్ర విభేదాలున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు ఒక కొత్త బిల్లును తీసుకొస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అంతర్గత విభేదాలను పరిష్కరించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
వెనుజులా కొత్త చమురు ఒప్పందం ద్వారా వచ్చే ఆదాయంతో ఏం చేయబోతున్నామో ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే రోడ్రిగ్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఆదాయంతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఔషధాలు, వెనిజులా విద్యుత్ గ్రిడ్, ఇంధన సౌకర్యాలను మెరుగుపరచడానికి అమెరికాలో తయారైన పరికరాలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం వెనిజులా అమెరికా చేతుల్లోనే ఉందంటూ ట్రంప్ తేల్చి చెప్పారు. వెనిజులూ ఆయిల్ నిల్వలన్నీ తమ ఆధినంలోకి వచ్చాయని తెలిపారు.
Movies :సంక్రాంతికి స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సినిమాలు..ఓటీటీ సందడికి రెడీ
